రామాయణంపై రాజమౌళి రివ్యూ.. ఆ హీరో అద్భుతంగా నటించాడంటూ జక్కన్న ప్రశంసలు

రాముడి కథతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.. తాజాగా అలా వచ్చిన సినిమానే రామాయణ పార్ట్ 1. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

రామాయణంపై రాజమౌళి రివ్యూ.. ఆ హీరో అద్భుతంగా నటించాడంటూ జక్కన్న ప్రశంసలు
Ramayana

Updated on: Nov 05, 2026 | 5:09 PM

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా, టాలీవుడ్ నటి సాయిపల్లవి సీతాదేవిగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో సినిమాను వీక్షించిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాలో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారతీయ ఇతిహాసాన్ని ఇంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశంలోనూ చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తోందని ప్రశంసించారు.

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ నటన తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని రాజమౌళి తెలిపారు. ముఖ్యంగా వనవాస ఘట్టం ప్రారంభమైన తర్వాత రాముడి పాత్రలో రణ్‌బీర్ చూపించిన ప్రశాంతత, గంభీరత అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పాత్రకు అవసరమైన హుందాతనాన్ని ఆయన చక్కగా ప్రదర్శించారని అభిప్రాయపడ్డారు. కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించారు. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారీ బలమైన ప్రభావం చూపించారని రాజమౌళి ప్రశంసించారు. రావణుడి పాత్రకు కావాల్సిన భయంకరమైన రూపాన్ని, గంభీరమైన వ్యక్తిత్వాన్ని యశ్ అద్భుతంగా ఆవిష్కరించారని పేర్కొన్నారు. సీతాదేవి పాత్రలో సాయిపల్లవి నటన కూడా రాజమౌళిని ఆకట్టుకుంది. సహజమైన అభినయంతో పాటు పాత్రకు అవసరమైన గౌరవం, హుందాతనాన్ని ఆమె తెరపై చూపించారని ప్రశంసించారు. రణ్‌బీర్, యశ్‌లతో పాటు సాయిపల్లవి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని అభిప్రాయపడ్డారు.

సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఘట్టాలు అత్యద్భుతంగా ఉన్నాయని రాజమౌళి తన స్పందనలో పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి భాగంలోని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయని తెలిపారు. సినిమా మొత్తాన్ని ఎంతో ఆస్వాదించానని వెల్లడించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును అద్భుతమైన దృశ్యరూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీతో పాటు చిత్రబృందం మొత్తానికి రాజమౌళి అభినందనలు తెలిపారు. ఆయన నుంచి వచ్చిన ప్రశంసలతో ‘రామాయణ: పార్ట్ 1’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us