
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఓ మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోలకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్.. ఇటీవల కాలంలో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయారు. ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు పూరి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘స్లామ్ డాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. పూరి జగన్నాథ్ సినిమాలకు ఒకప్పుడు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన రాసే డైలాగులు, హీరోలను చూపించే విధానం, వేగంగా సాగే కథనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. సెట్స్‌లో నటీనటులతో ఆయన వ్యవహరించే తీరు మాత్రం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడిన పూరి జగన్నాథ్.. హీరోలు తనతో పనిచేయడానికి ఇష్టపడటానికి గల కారణాలను వివరించారు.
షూటింగ్ సమయంలో నటీనటులను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, వారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడమే తన పద్ధతి అని ఆయన వెల్లడించారు. ఒక సన్నివేశం కోసం పదేపదే టేకులు తీసుకోకుండా.. నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టి, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. దీంతో హీరోలు సెట్స్‌లో సౌకర్యంగా ఉంటారని, పని కూడా వేగంగా పూర్తవుతుందని ఆయన వివరించారు.యంగ్ హీరోలతోనే కాకుండా సీనియర్ నటులతోనూ పూరి జగన్నాథ్‌కు మంచి అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ఆయన చేసిన పైసా వసూల్ సినిమా షూటింగ్ అనుభవాల గురించి గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ చాలా వేగంగా సన్నివేశాలను పూర్తి చేస్తారని, ఆయనతో పనిచేయడం తనకు ఎంతో నచ్చిందని పూరి ప్రశంసించారు.
బాలకృష్ణతో కలిసి పనిచేసిన తర్వాత ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా.? అని అనిపించిందని పూరి చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా బాలకృష్ణ ఎంతో సింపుల్‌గా ఉంటారని, చిన్నపిల్లాడిలా మనసులో ఏమీ దాచుకోకుండా సూటిగా వ్యవహరిస్తారని కొనియాడారు. ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పైసా వసూల్ విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే చూడాలని కోరుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. గతంలో బాలయ్యతో మళ్లీ సినిమా చేయాలనే తన ఆసక్తిని పూరి వ్యక్తం చేశారు. అయితే ఈ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతితో తెరకెక్కిస్తున్న స్లామ్ డాగ్ సినిమాపైనే పూరి జగన్నాథ్ ఆశలు పెట్టుకున్నారు. టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ సినిమాతో అందుకుంటారా.? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.