
గత రెండు రోజులుగా ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఫేమ్ నందన పేరు తెగ వినిపిస్తోంది. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా నందనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. లండన్ లో ఉన్న ఆమె విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ చాలా మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వీసా రెన్యూవల్స్ అంటూ భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు నందనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి నందనతో పాటు ఆమె భర్త మధుకర్ పై కూడా కేసులు కూడా నమోదు అయ్యాయి. అంతేకాదు ఈ దంపతుల పట్ల లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయినా రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీ ఉండనుందని తెలుస్తోంది. కాగా తనపై లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ నందన ఇండియాకు రావడం పలు సందేహాలకు తావిస్తోంది.అయితే నందన బిగ్ బాస్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఈ పనుల నిమిత్తమే ఇండియా వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలోనే పోలీసుల చేతికి నందన చిక్కారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నందన బిగ్ బాస్ హౌస్ 10 లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందన్న వార్తలపై కాంగ్రెస్ ప్రముఖ నాయకురాలు సంధ్యారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ తో పాటు హోస్ట్ నాగార్జునకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన సంధ్యా రెడ్డి నందన బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించారు. ఎంతోమంది నిరుద్యోగులను మోసం చేసిన నందనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని రియాలిటీ షో నిర్వాహకులకు అలాగే హోస్ట్ నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారామె. ‘నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఇలాంటి క్రిమినల్స్ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తారు. ఇలా మోసాలకు పాల్పడే వారిని బిగ్ బాస్ లోకి పంపిస్తే నాగార్జున గారిని కూడా ప్రశ్నిస్తాం. ఈ విషయంలో కచ్చితంగా రచ్చ చేస్తాం’ అని సంధ్యా రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి నందన నిజంగానే బిగ్ బాస్ 10లోకి అడుగు పెడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.