ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే..

సంపూర్ణ రామాయణం చిత్రం విడుదలై 54 ఏళ్లు దాటింది. ఎన్టీఆర్ శ్రీరామునిగా స్థిరపడిన రోజుల్లో శోభన్ బాబుతో బాపు-రమణ చేసిన సాహసం ఇది. అనేక అంచనాలను తారుమారు చేస్తూ, ఆరంభంలో ఆదరణ లేకున్నా, అనూహ్య విజయంతో రికార్డులు సృష్టించింది. ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా, పౌరాణిక చరిత్రలో అగ్రస్థానాన్ని పొంది, తెలుగు సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది.

ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే..
Shobhanbabu Ramayanam

Updated on: Jul 04, 2026 | 9:55 AM

తెలుగు సినీ చరిత్రలో “సంపూర్ణ రామాయణం” ఒక చెరగని ముద్ర వేసింది. 1972 మార్చి 16న విడుదలైన ఈ చిత్రం నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. “లవకుశ” చిత్రంతో ఎన్టీఆర్ శ్రీరామునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన తర్వాత, శోభన్ బాబుని శ్రీరాముడిగా చూపిస్తూ బాపు-రమణ చేసిన ప్రయత్నం ఒక సాహసమే. అనేక అంచనాలను తలకిందులు చేసి, ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. ఆరు, ఏడు లక్షల బడ్జెట్ ఎక్కువగా భావించే రోజుల్లో దాదాపు 16 లక్షల వ్యయంతో “సంపూర్ణ రామాయణం” చిత్రాన్ని నిర్మించారు బాపు-రమణ. బెంగళూరుకు చెందిన మూల భక్తవత్సలం, హైదరాబాద్‌కు చెందిన బాలా గౌడ్ భాగస్వాములుగా ఎన్.ఎస్.మూర్తి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ప్రారంభించే ముందు బాపు-రమణ ఎన్టీఆర్‌ను కలిసి విషయం చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్, తన వద్ద సముద్రాల సీనియర్ రాసిన శ్రీరామ పట్టాభిషేకం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, మీరు తొందరపడితే ఇబ్బంది పడతారని చెప్పినట్లు కథనం. తమకు ఇంకా వ్యవధి ఉంది కనుక శోభన్ బాబుతో ప్రయత్నిస్తామని చెప్పి, ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. “సంపూర్ణ రామాయణం” చిత్రం తీస్తున్నట్లు ప్రకటించగానే, కమ్యూనిస్టు ఆరుద్ర, కామెడీ రైటర్ రమణ, కార్టూనిస్ట్ బాపు రామాయణం కథను తీయడం, అందులో రాముడిగా శోభన్ బాబు నటించడంపై అనేక కామెంట్లు, విమర్శలు వచ్చాయి. దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించిన బాపు, చిత్రాన్ని దృశ్యకావ్యంగా అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. ఈ చిత్రంలో నటించినందుకు శోభన్ బాబుకు 40,000 రూపాయల పారితోషికం ఇవ్వగా, రావణుడిగా నటించిన ఎస్.వి. రంగారావుకు 60,000 రూపాయలు ఇచ్చారు. సీతగా చంద్రకళ, కైకగా జమున నటించారు. మొదట కైక పాత్ర చేయడానికి జమున ఒప్పుకోక, సీత పాత్ర అడిగారు. బాపు-రమణ ఆమెను ఒప్పించి, కేవలం 10 రోజులు మాత్రమే పనిచేసినందుకు డబ్బుకు బదులుగా 37,000 రూపాయలతో కొత్త అంబాసిడర్ కారు కొనిచ్చారు. సెట్‌లో తొలి రోజు, సీత వేషంలో ఉన్న చంద్రకళను చూసి ఎస్.వి. రంగారావు, “ఛీ ఈమెనా సీత! ఈవిడ గారిని నేను ఎత్తుకుపోవడం, ఈ పిల్ల కోసం యుద్ధం చేయడం? జమున అనుకున్నానే, ఆవిడైతే బావుంటుంది” అన్నారు. అప్పుడు బాపు, జమున కైక వేషం వేస్తున్నారని చెప్పారు. అక్కడికి వచ్చిన చంద్రకళను చూసి, “నువ్వా లక్షణంగా ఉన్నావు. ఇందాక నేను అన్న మాటలు నువ్వేం వినలేదుగా, ఏవో జోకులు వేసుకుంటాం నువ్వేం పట్టించుకోవద్దు” అని రంగారావు అన్నారు.

శోభన్ బాబు ఈ చిత్రం నుంచే సాయంత్రం ఆరు దాటిన తర్వాత పనిచేయకూడదని, ఆదివారాలు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకొని, కఠినంగా అమలు చేసేవారు. సినిమాలోని అవుట్ డోర్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించారు. అక్కడ గవర్నమెంట్ హైస్కూల్‌కు 20 రోజుల పాటు సెలవులు ఇప్పించారు. హెడ్మాస్టర్ గదిలో శోభన్ బాబు, టీచర్స్ రూమ్‌లో చంద్రకళ బస చేశారు. చిన్న సెలయేరు దాటి పర్ణశాల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. చంద్రకళ పారాణి చెరిగిపోకుండా, కో డైరెక్టర్ బోస్ ఆమెను ఎత్తుకొని పర్ణశాల దగ్గరికి తీసుకువెళ్లేవారు. మాయలేడి సన్నివేశం కోసం ఒక జింకను ముందే కొని పెంచారు. అది ఇడ్లీ తిని, కాఫీ తాగేది. వాల్మీకి చెప్పిన రామాయణాన్ని మార్పులు చేయకుండా, సీతారాముల కథగా పూర్తి స్థాయిలో తీసిన చిత్రం “సంపూర్ణ రామాయణం”. ఆ రోజుల్లో ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు. ఎల్.వి. ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనందబాబు సహకారంతో అతి కష్టం మీద 75 రోల్స్‌కి ఇంపోర్టెడ్ లైసెన్సు సంపాదించి చిత్రాన్ని పూర్తి చేశారు. “సంపూర్ణ రామాయణం” చిత్రం మీద ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. విడుదలైనప్పుడు థియేటర్లలో జనం లేరు. టాక్ విని శోభన్ బాబు బాధపడి వారం రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మూడవ వారం నుంచి సినిమా బావుందనే టాక్ మెల్లమెల్లగా మొదలై కలెక్షన్లు ఊపందుకున్నాయి. సినిమా చూడటం మానేసిన వాళ్లు కూడా థియేటర్లకు రావడం ప్రారంభించారు.

లవకుశ తర్వాత పల్లెల నుంచి బళ్ళు కట్టుకుని జనం వచ్చి చూసిన సినిమా ఇదే. “సంపూర్ణ రామాయణం” సాధించిన రికార్డులు అనూహ్యమైనవి. ఈస్ట్ మన్ కలర్ పౌరాణిక చిత్రాల్లో 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే. బెంగళూరులో ఆలస్యంగా విడుదలైనప్పటికీ అక్కడ కూడా 100 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 70 ఎంఎం థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రం “సంపూర్ణ రామాయణం”. వరంగల్ నవీన్, కడప రహమతియా, తిరుపతి వెంకటేశ్వర, విజయవాడ వినోద, విశాఖపట్నం రాజేశ్వరి, గుంటూరు లిబర్టీ, రాజమండ్రి అప్సరా థియేటర్స్‌లో తొలి 100 రోజుల చిత్రంగా ఇది నిలిచింది. విడుదలైన 15 ఏళ్ల తర్వాత 1987లో మళ్లీ రిలీజ్ అయ్యి హైదరాబాద్లో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అలాగే ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేయగా, అక్కడ కూడా ఘన విజయం సాధించి 1973లో టాప్ కలెక్షన్లు సాధించిన ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.  బొంబాయిలో కూడా 100రోజులు ఆడిన తెలుగు చిత్రం ఇదొక్కటే.

Follow Us