బాలనాగమ్మగా జమున, కార్యవర్దిగా రామకృష్ణ.. షూటింగ్ అయినా ఎందుకు రిలీజ్ కాలేదు..?

తెలుగు జానపద కథ బాలనాగమ్మ అనేకసార్లు తెరకెక్కి విజయం సాధించింది. అయితే, కళాభారతి జమున, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో 1974లో కలర్‌లో ప్రారంభమైన ఈ బాలనాగమ్మ చిత్రం నిర్మాత ఆకస్మిక మరణంతో నిలిచిపోయింది. 14 ఏళ్ల తర్వాత పునరుద్ధరించినా, నటుల మార్పులు, ఆర్థిక ఇబ్బందులతో విడుదల కాలేక శాశ్వతంగా సినీ చరిత్రలో నిలిచిపోయింది.

బాలనాగమ్మగా జమున, కార్యవర్దిగా రామకృష్ణ.. షూటింగ్ అయినా ఎందుకు రిలీజ్ కాలేదు..?
Balanagamma Film History

Updated on: Sep 01, 2026 | 1:41 PM

తెలుగు జానపద కథల్లో బాలనాగమ్మ కథకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు నేలపై ఈ కథ తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పల్లెటూళ్లలో ఇప్పటికీ మాయల ఫకీరు, బాలనాగమ్మ కథలను చెప్పుకుంటారు. ఈ మహత్తర కథను నాటకాలుగా ప్రదర్శించి, ప్రజల ఆదరణ పొందేవి. తెలుగు టాకీలు మొదలైన రోజుల్లో ఈ బాలనాగమ్మ నాటకాన్ని సినిమా రూపంలోకి తీసుకురావాలని చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపారు. తొలిసారిగా 1942లో జెమినీ సంస్థ అధినేత వాసన్ ఈ బాలనాగమ్మ కథను తెరకెక్కించారు. అలనాటి అందాల తార కాంచనమాల బాలనాగమ్మగా, గోవిందరాజుల సుబ్బారావు మాయల ఫకీరుగా, బందా కనకలింగేశ్వరరావు కార్యవర్ధిరాజుగా, పుష్పవల్లి సంగుగా నటించారు. రేలంగి కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. 1942 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ సెట్స్‌తో రూపొంది, డైరెక్టుగా వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, జెమినీ వారి బాలనాగమ్మ చిత్రానికి కళా దర్శకుడిగా పనిచేసిన ఎస్వీఎస్ రామారావు, జెమినీ వాసన్‌తో విబేధాల కారణంగా సంస్థ నుంచి బయటకు వచ్చి, జెమినీ చిత్రానికి పోటీగా శాంత బాలనాగమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిస్ చలం బాలనాగమ్మగా నటించారు. జెమినీ బాలనాగమ్మ చిత్రం కంటే ముందుగానే, 1942 నవంబర్ 21న ఈ శాంత బాలనాగమ్మ సినిమాను విడుదల చేశారు. కానీ, అది విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో బాలనాగమ్మ కథను ఆధారం చేసుకుని మరిన్ని చిత్రాలు వచ్చాయి. 1959లో వచ్చిన బాలనాగమ్మ చిత్రంలో అంజలీదేవి ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ఎన్టీఆర్ కార్యవర్ధిరాజుగా, ఎస్వీఆర్ మాయల ఫకీరుగా నటించారు. మాస్టర్ సత్యనారాయణ బాలవర్ధిగా, రాజసులోచన సంగుగా నటించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఆర్థిక విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు శ్రీదేవితో బాలనాగమ్మ చిత్రం తీస్తానని ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు. అయితే, 1982లోనే శ్రీదేవి కథానాయికగా ఒక బాలనాగమ్మ చిత్రం వచ్చింది. ఇందులో శరత్ బాబు కార్యవర్ధిగా, సుదర్శన్ మాయల ఫకీరుగా, మంజు భార్గవి సంగుగా నటించారు. ఈ సినిమా 1982 ఏప్రిల్ 30న విడుదలైంది. ఈ చిత్రాలన్నింటి మధ్య, కళాభారతి జమున కథానాయికగా బాలనాగమ్మ చిత్రం మొదలై విడుదల కాకుండా ఆగిపోయింది. 1974 సెప్టెంబర్ 6న వాసు స్టూడియోలో నిర్మాత జై కృష్ణ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. సి.ఎస్. రావు దర్శకుడుగా వ్యవహరించారు.

అంతకుముందు వచ్చిన బాలనాగమ్మ చిత్రాలు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండగా, ఈ చిత్రాన్ని కలర్‌లో రూపొందించడం విశేషం. జమున బాలనాగమ్మగా, రామకృష్ణ కార్యవర్ధిరాజుగా, కైకాల సత్యనారాయణ మాయల ఫకీర్‌గా, ప్రమీల సంగుగా, మాస్టర్ రాము బాలవర్ధిరాజుగా ఎంపికయ్యారు. పద్మనాభం, అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, త్యాగరాజు, రాజసులోచన వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 12000 అడుగుల ఫిల్మ్ తయారయ్యే సమయానికి, అంటే చాలా భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత, నిర్మాత జై కృష్ణ ఆకస్మికంగా అపెండిసైటిస్ కారణంగా మరణించారు. దీంతో చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది. నిర్మాణ సారధి కేఎం నాయుడు కూడా చేతులెత్తేయడంతో సినిమా అడుగు ముందుకు పడలేదు, కొన్నేళ్ల పాటు సమాధి స్థితిలో ఉండిపోయింది. 1989లో నిర్మాత కందీపి సాంబశివరావు చొరవతో 14 ఏళ్ల తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి కదలిక వచ్చింది. అయితే, ఈ సమయానికి నటీనటుల రూపురేఖల్లో చాలా మార్పులు వచ్చాయి. మాస్టర్ రాము పెద్దవాడైపోయారు, రామకృష్ణ, జమున అప్పటికే ఫేడ్ అవుట్ అయ్యారు. పాత సన్నివేశాలకు సరిపోయేలా కొత్త సీన్లు తీయడం కష్టంగా మారింది. దీంతో మిగిలిన సన్నివేశాల్లో బుదరాజు నాగేశ్వరరావు రచించిన బుర్ర కథను అక్కడక్కడ ఉపయోగించారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ బుర్ర కథకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. రాజ్యలక్ష్మి, రణధీర్, మాస్టర్ సుధీర్‌లపై ఈ బుర్ర కథను చిత్రీకరించారు. పాత నటీనటులను బతిమాలి డబ్బింగ్ చెప్పించారు.

తొలి కాపీ సిద్ధమైనా, ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పటికి జానపద చిత్రాల యుగం ముగిసింది, కొత్త తరం ప్రేక్షకులు వచ్చారు. అందుకే ఈ బాలనాగమ్మ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఏడేళ్ల పాటు ఈ చిత్రం బాక్సులకే పరిమితమైంది. 1996లో ఈ సినిమా పేరును మాయల మరాఠీగా మార్చి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు, కళాభారతి జమున నటించిన ఈ బాలనాగమ్మ చిత్రం బాక్సులోనే శాశ్వతంగా సమాధి అయిపోయింది. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన జమున, రామకృష్ణ, కైకాల సత్యనారాయణ, దర్శకుడు సి.ఎస్. రావు వంటి ప్రముఖులు ప్రస్తుతం లేరు. ఒక ముఖ్య పాత్ర పోషించిన రమాప్రభ మాత్రం ఉన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో, ఆ ఫిల్మ్ బాక్సును వెతికి తీసి, డిజిటలైజ్ చేసి విడుదల చేస్తే బాగుంటుందని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us