
ప్రముఖ నటి దివ్యవాణి, తనదైన శైలి నటనతో బాపు బొమ్మగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం, సినీ రంగంలో ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దివ్యవాణి ఒకప్పుడు మెరుపులా వెలిగిన హీరోయిన్ గా, ప్రస్తుతం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బోల్డ్ పర్సనాలిటీగా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. దివ్యవాణి తన కెరీర్ లో వచ్చిన ఒక కీలక అవకాశాన్ని కోల్పోయిన వైనాన్ని వివరించారు. రవితేజ హీరోగా వల్లభనేని వంశీ దర్శకత్వంలో వచ్చిన టచ్ చేసి చూడు చిత్రంలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించారు. రవితేజ అంటే తనకు మొదటి నుంచీ చాలా ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలని కోరుకున్నానని తెలిపారు.
అయితే ఆ సమయంలో రవితేజ స్లిమ్ గా ఉండటంతో, దివ్యవాణిని చూసి ఈ అమ్మాయి ఏ యాంగిల్ లో నాకు తల్లి లాగా ఉంటుందండి.? అని అడిగారని చెప్పారు. పాత్ర కోసం తెల్ల జుట్టు వేసినా కూడా, తల్లి దివ్యవాణిలా లేరు, కలెక్టర్ దివ్యవాణిలా ఉన్నారు అని రవితేజ అనడంతో ఆ అవకాశం చేజారిపోయిందని దివ్యవాణి వివరించారు. హీరోయిన్ గా చూసిన ప్రేక్షకులు తల్లి పాత్రల్లో అంగీకరించక పోవడం, కానీ తల్లి పాత్రలకు తాను చాలా యంగ్ గా కనిపించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు సినీ రంగంలో ఒక కుటుంబ వాతావరణం ఉండేదని, శారదా గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు వంటి వారు ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చేవారని దివ్యవాణి గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరు చొచ్చుకు వెళ్తే వాళ్లకే అవకాశాలు అనే విధంగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. నటీనటులు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుందని, దీని వల్ల అనేక అవకాశాలు వస్తున్నాయని స్నేహ వంటి నటీమణుల ఉదాహరణతో చెప్పారు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న దివ్యవాణి, తన పిల్లలు యూఎస్ లో ఉండటం, కొన్ని వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నానని తెలిపారు. అయితే భవిష్యత్తులో సొంత నిర్మాణ సంస్థ డీవీ క్రియేషన్స్ ద్వారా సినీ రంగంలోకి తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నారు. వాయిస్ ఆఫ్ దివ్యవాణి వంటి కార్యక్రమాలతో పాటు, సొంతంగా సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు. దర్శకులను అడగడం వంటివి లేకుండా, తమ టాలెంట్ ని బట్టి అవకాశాలను సృష్టించుకునేందుకు ఈ కాలంలో AI వంటి సాంకేతికతలు సహాయ పడుతున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దివ్యవాణి తన జీవితంలో బాపు బొమ్మగా గుర్తింపు పొందడాన్ని దేవుడిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తారు. బాపు-రమణల దర్శకత్వంలో పెళ్లి పుస్తకం వంటి చిత్రాలు తన వ్యక్తిత్వానికి తగిన పాత్రలు అందించాయని, వారి రుణం తీర్చుకోలేనని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో మందు, పొందు, విందు అనే సంస్కృతి ఉంటుందని, తన తల్లి తనను జాగ్రత్తగా కాపాడుకుందని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. ఇండస్ట్రీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, తన తల్లి రక్షణ వల్ల తనకు ఎప్పుడూ ఇబ్బంది తెలియలేదని ఆమె స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి