
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తన సినిమాలు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌తో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. అయితే కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోషల్ మీడియాకు పూర్తిగా దూరం కావడం అప్పట్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా తన కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాను ఎందుకు వదిలేశారో వివరించారు. ఏడాది పాటు ఆన్‌లైన్ ప్రపంచానికి దూరంగా ఉన్న తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను ఆమె ఓపెన్‌గా పంచుకున్నారు. జర్నలిస్ట్ పూజా తల్వార్‌తో జరిగిన సంభాషణలో ఐశ్వర్య లక్ష్మి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియా అకౌంట్లను తొలగించిన తర్వాత మొదట్లో అది పెద్ద నిర్ణయంలా అనిపించినప్పటికీ, ఆ తర్వాత తనకు ఎంతో ప్రశాంతత లభించిందని చెప్పారు.
తరచూ ఫోన్ చెక్ చేయడం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవడం వంటి అలవాట్లు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తన రోజువారీ జీవితంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా నా ఆలోచనలను ప్రభావితం చేసింది. సోషల్ మీడియా వల్ల వచ్చే పాపులారిటీని పూర్తిగా వ్యతిరేకించడం లేదని ఐశ్వర్య స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు గుర్తింపు తెచ్చుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే తన విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారిందని చెప్పారు. నటిగా కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియా కూడా కెరీర్‌లో ఒక భాగమేనని భావించానని, కానీ కొంతకాలానికి అది తన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా తన పరిశోధన, కొత్త విషయాలపై ఆలోచించే విధానం, భాషపై దృష్టి, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు వంటి వాటిపై సోషల్ మీడియా ప్రభావం పడిందని ఐశ్వర్య పేర్కొన్నారు. అందుకే చివరికి దానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సినీ తారలకు సోషల్ మీడియా ఇప్పుడు ప్రమోషన్స్‌లో కీలక సాధనంగా మారింది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్‌తో పాటు అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతోంది. అయితే ప్రతి నటుడికి సోషల్ మీడియా తప్పనిసరి కాదని ఐశ్వర్య లక్ష్మి తన నిర్ణయంతో చెప్పకనే చెప్పారు. పాపులారిటీ కోసం నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండటం కంటే, తన పని మీద దృష్టి పెట్టడం తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. పొన్నియిన్ సెల్వన్’తో పాన్ ఇండియా గుర్తింపు. ఐశ్వర్య లక్ష్మి 2017లో మలయాళ చిత్రం ‘జ్ఞాండ్యుకలుడే నత్తిల్ ఒరిడవేల’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘మాయానది’, ‘గోదా’ వంటి చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.