హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఈ ఇద్దరూ కలిసి శుభలేఖలు కూడా పంచుతున్నారని ప్రచారం జరిగింది. అటు పలువురు సినీ ప్రముఖులు కూడా సుమంత్ రెండో పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తన రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై హీరో సుమంత్ స్పందించారు.. తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని స్పష్టం చేశారు. తాను మరోసారి పెళ్లిచేసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు సుమంత్.
ఆ వీడియోలో సుమంత్ మాట్లాడుతూ.. ఈ మధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని వార్తలు వస్తున్నాయి. కానీ నేను నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం లేదు. విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాంటి కథతో ఓ సినిమా రావడం తెలుగులో ఇదే మొదటిసారి. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. దీంతో అందరూ అపార్థం చేసుకున్నారు అంటూ వివరణ ఇచ్చారు. అయితే సుమంత్ వీడియో ట్వీట్ చేస్తూ.. తన పెళ్లిపై స్పందించిన ఆర్జీవిని సైతం ట్యాగ్ చేశారు.
ట్వీట్..
?? Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me ? https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021
సుమంత్ గతంలో తొలిప్రేమ ఫేమ్ కీర్తి రెడ్డితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సుమంత్ మొదటిగా ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమా ద్వారానే సినీ కెరీర్ ప్రారంభించారు. ఇక ఆ తర్వాత సుమంత్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. దీంతో నెమ్మది నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇటీవల కపటదారి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్తు మరోసారి నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం సుమంత్.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు.