
తన కెరీర్ తొలినాళ్లలో కొందరు హీరోలు తనను విలన్ గా పెట్టుకుంటే మ్యాచ్ చేయలేము అని చెప్పి కొన్ని ప్రాజెక్టులు మిస్ అయ్యాయని సంపత్ రాజ్ తెలిపారు. అయితే, మహేష్ బాబుతో సహా చాలా మంది స్టార్ హీరోలతో తాను కలిసి పనిచేశానన్నారు. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమా తనకు చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ గారు తనను పిలవగానే, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్లు చెప్పారు. మహేష్ బాబు నటన గురించి మాట్లాడుతూ, ఆయన చాలా సెటిల్డ్‌గా నటిస్తారని, లౌడ్ యాక్టింగ్ ఉండదని వివరించారు. “మహేష్ బాబు ఒక నాచురల్ యాక్టర్. మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నట్లుగానే షాట్లో కూడా ఆయన నటిస్తారు. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడం కదా, అలాగే ఆయన యాక్టింగ్ కూడా ఉంటుంది” అని సంపత్ రాజ్ అన్నారు. ఆయన ఆరా, లుక్స్, పర్సనాలిటీ ఆయన నటనకు తోడై స్క్రీన్ పై మరింత ప్రభావం చూపుతాయని ప్రశంసించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంపత్ రాజ్ తనకున్న అపార గౌరవాన్ని తెలియజేశారు. “సినిమా తీయకపోయినా పర్లేదు గానీ, ఆయనతో కూర్చుని మాట్లాడితే చాలు” అని చెప్పి త్రివిక్రమ్ వెనక చాలా రోజులు పడ్డానని అన్నారు. త్రివిక్రమ్ ఆలోచనా విధానం, ఆయన కూల్ స్వభావం, సినిమాల్లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ తనకు ఎంతో నచ్చుతాయన్నారు. “ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయొచ్చు. అలాంటి రైటర్ మైండ్ లోపలికి వెళ్లి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంటుంది” అని సంపత్ రాజ్ పేర్కొన్నారు. త్రివిక్రమ్ తో తాను తక్కువ సినిమాలు చేసినప్పటికీ, ఆయనతో తరచుగా మాట్లాడుతూ ఉంటానన్నారు. “నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాయండి, మంచి క్యారెక్టర్ రాయండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను” అని అడుగుతూ ఉంటానని, దానికి త్రివిక్రమ్ కూడా “ఒక క్వాలిటీ క్యారెక్టర్ రాస్తే 100% పిలుస్తాను, డోంట్ వర్రీ” అని చెప్తుంటారని సంపత్ రాజ్ వివరించారు.
సంపత్ రాజ్ లోని రచయితను త్రివిక్రమ్ గుర్తించి, ఆయనను కథలు రాయమని ప్రోత్సహించారని సంపత్ రాజ్ గుర్తు చేసుకున్నారు. “నీలో ఒక రైటర్ ఉన్నాడు, నువ్వు కచ్చితంగా కథలు చెప్పాలి” అని త్రివిక్రమ్ చెప్పారన్నారు. తన దగ్గర మూడు కథలు ఉన్నాయని, కచ్చితంగా సినిమాలు తీయాలని గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా, ఆ ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయని సంపత్ రాజ్ స్పష్టం చేశారు. అందులో ఒక కథ బలమైన మహిళా ప్రధాన సబ్జెక్ట్ అని, ఆ పాత్రకు తగ్గ హీరోయిన్ ను వెతకాలని చూస్తున్నట్లు చెప్పారు. “ఒక అమ్మకి, కూతురికి, ఫాదర్ మధ్య జరిగే ఒక కథ అది. అలాంటి ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ ను ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి” అని సంపత్ రాజ్ అన్నారు. ఇప్పటికే ఒక పేరున్న డైరెక్టర్ కు ఈ కథ చెప్పగా, ఆయన చేస్తానని ఒప్పుకున్నట్లు తెలిపారు.