Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్

'రాజా ది రాజా' చాలా ప్యాషన్ తో తీసిన సినిమా అని, మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని హీరో రుత్విక్ పేర్కొన్నాడు. ఈ సినిమా విజువల్‌, మ్యూజికల్‌గా చాలా అద్భుతంగా వచ్చిందని, ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందన్నాడీ యంగ్ హీరో.

Raja The Raja: రాజా ది రాజా చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్
Raja The Raja Movie

Updated on: Jul 15, 2026 | 10:56 PM

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రుత్విక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ తొలి సినిమా విడుదలకు వస్తోంది. ఎలా అనిపిస్తోంది?

-చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అదే సమయంలో కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆసక్తి, టెన్షన్ రెండూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో దాదాపు ప్రతి విభాగం నుంచి ఎంతో నేర్చుకున్నాను. పూర్తిగా మొదటి నుంచి ప్రారంభించాను. ఈ మొత్తం ప్రయాణం నాకు ఒక గొప్ప అనుభవంలా అనిపించింది. నా క్రాఫ్ట్‌పై, కథపై ఉన్న నమ్మకంతో, చాలా పాజిటివ్ వైబ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నా క్రాఫ్ట్‌పై నాకు ఉన్న గౌరవం, నమ్మకం ప్రేక్షకుల ఆదరణను తప్పకుండా తీసుకొస్తుందని నమ్ముతున్నాను.

యాక్టర్ కావడానికి మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏమిటి?

చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంది. స్కూల్‌లో, నాటకాల ప్రదర్శనల్లో పాల్గొనేవాడిని. షేక్స్పియర్ నాటకంలో డ్యూక్ పాత్ర కూడా చేశాను. అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చదివాను. అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో డ్యూయల్ రోల్ చేశాను. అందులో అబ్బాయిగానూ, అమ్మాయిగానూ నటించాను. నాకు ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉంటుంది. యాక్టింగ్ బయట నుంచి చూసినప్పుడు ఒకలా కనిపిస్తుంది. కానీ పరిశ్రమలోకి వచ్చాక అది ఎంత కష్టమైన ప్రయాణమో తెలుస్తుంది. ఆ కష్టాలు మాటల్లో చెప్పలేం… అనుభవిస్తేనే అర్థమవుతాయి.

ఈ సినిమా చేయడానికి ముందు ఎన్ని కథలు విన్నారు?

దాదాపు ఏడు కథలు విన్నాను. అందులో ‘మార్సల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఒక కథ వుంది. నిజానికి దాంతోనే హీరోగా పరిచయం కావాలనుకున్నాను. దాని కోసం ఏడు నెలలు ప్రిపరేషన్ కూడా చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత మంచి కథ కోసం చూస్తున్న సమయంలో ‘రాజా ది రాజా’ వచ్చింది.

తొలి సినిమాకే రెండు గెటప్స్ చేయడం ఎలా అనిపించింది?

నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం. ఈ సినిమాలోని రెండు గెటప్స్ కోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యాను. కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా చూసుకున్నాను. విక్రమ్ గారు, కమల్ హాసన్ గారు చేసిన విభిన్న పాత్రలు నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ‘అపరిచితుడు’, ‘చంద్రముఖి’ లాంటి సినిమాలు చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అప్పుడే శ్లోకాలు, సంగీతం కూడా నేర్చుకున్నాను. ‘చంద్రముఖి’ చూసిన తర్వాత భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్చుకున్నాను. అప్పుడు నాకు తెలియదు కానీ… తర్వాత ఫిల్మ్ కోర్స్‌లో చేరినప్పుడు నేను అనుసరించిన విధానాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారని తెలిసింది.

సాయికుమార్ గారు, నరేష్ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

-నరేష్ గారు నా తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఆయనతో నటించడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. కానీ ‘యాక్షన్’ అనగానే పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతారు.

-సాయికుమార్ గారితో నటించడం కూడా గొప్ప అనుభవం. ఒక సీన్ పూర్తి చేసిన వెంటనే పాత్ర నుంచి బయటకు వచ్చి చాలా కూల్‌గా మారిపోతారు. అది చూడటం నాకు చాలా కొత్త అనుభవంగా అనిపించింది.

డైరెక్టర్ అనిల్ బోయిడపు గురించి?

-తనకి సినిమా అంటే చాలా పాషన్. పలు సూపర్ హిట్ సినిమాలకు ఆయన అసోసియేట్ గా పని చేశారు. చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. చాలా మంచి డైరెక్టర్ అవుతారు.

ఈ ప్రయాణంలో మీ కుటుంబం నుంచి వచ్చిన సపోర్ట్ ఎలా ఉంది?

-మా నాన్నగారికి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టమని చెప్పేవారు. ఒకసారి న్యూయార్క్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా ఆనందపడ్డారు. అప్పటి నుంచి నాకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లమని ప్రోత్సహించారు. నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. చాలా ప్రాసెస్ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి మంచి ప్రశంసలు రావడంతో మా కుటుంబానికి కూడా నాపై మరింత నమ్మకం వచ్చింది.

ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?

-ఈ కథలో ఒక చాలా బలమైన పాయింట్ ఉంది. అదే నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ అంశం జూలై 17న మీరు బిగ్ స్క్రీన్‌పై చూస్తారు. అది మీకూ తప్పకుండా నచ్చుతుంది. ఇది మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. విజువల్‌గా, మ్యూజికల్‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

నాగ్ అశ్విన్ గారు ఈ సినిమా చూశారా?

ఇంకా పూర్తి సినిమా చూడలేదు. టీజర్, ట్రైలర్ ఆయనకు చాలా నచ్చాయి. “నీ ప్రయాణాన్ని నువ్వే నిర్మించుకోవాలి” అని నాకు చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి?

మైత్రీ రవి గారు టీజర్, ట్రైలర్‌తో పాటు పూర్తి సినిమా కూడా చూశారు. సినిమా వారికి చాలా నచ్చింది. మంచి స్కేల్‌లో, గ్రిప్పింగ్‌గా తీశారని చెప్పారు. సినిమా కథ, కంటెంట్‌పై నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్‌కు యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టారట. నిజమేనా?

అవును. ఇందులో నాకు, నరేష్ గారికి మధ్య ఒక ముఖ్యమైన సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అది పూర్తయ్యాక నరేష్ గారు నా నటనను అందరి ముందూ ప్రశంసించారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం.

మీ నిర్మాణ సంస్థలో భవిష్యత్తులో కూడా సినిమాలు చేస్తారా?

తప్పకుండా. సినిమా నిర్మాణాన్ని కొనసాగిస్తాం.

హీరోయిన్ విశాఖ గురించి?

-విశాఖ చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.

ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

-చాలా ప్రేమతో, ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. మేమంతా కొత్తవాళ్లమే అయినా ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఒక కొత్త టాలెంట్‌ను మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. మంచి ఫన్, మంచి ఎమోషన్స్ ఉంటాయి. విజువల్‌గా, మ్యూజికల్‌గా కూడా సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

కొత్తగా చేయబోయే సినిమాలు?

-కొన్ని కథలు వింటున్నాను. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం.

 

Follow Us