
హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. ఈ మూవీకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ టీజర్‌ని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ .. ‘హర్ష గారు ‘హుషారు 2’లో నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ‘హుషారు’లో ఎంత నవ్వించారో.. అంతకు మించి నవ్విస్తూనే, ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను ఎంతో గొప్పగా చూపించారు. పని హక్కుని కోల్పోతోన్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లేదు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా కూడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. కెమెరామెన్ ఎంతో ఓర్పుగా ఉన్నాడు. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా సరే స్టార్లను చేస్తారు. అలా ఈ మూవీని జనాలకు నచ్చేలా హర్ష తీశారు. ‘హుషారు 2’ మూవీని జనాల వద్దకు తీసుకు వెళ్లాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ .. ‘‘హుషారు’ నా జీవితంలో బెస్ట్ మెమోరీ. రెండో పార్ట్‌ని ఏదో తీయాలని తీయలేదు. నా జీవితంలో నా స్నేహితులతో కలిసి చేసిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ తీశాను. నా చిన్ననాటి ఫ్రెండ్ రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాణంలోకి వచ్చాడు. నాకు రాహుల్ మంచి స్నేహితుడు. ఈ చిత్రంలో రాహుల్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. సినిమాని చూస్తే అశోక్ గల్లా, శశి, దినేష్, రవి ఆంటోనీ రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌లా కనిపిస్తారు. మూర్తి గారితో వర్క్ చేయడం ప్రైస్ లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మున్ముందు ఈవెంట్లలో మరిన్ని మాట్లాడతాను’ అని అన్నారు.
కాగా హుషారు 2 సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఇందులో నక్సలిజం బ్యాక్ డ్రాప్ కూడా ఉందట. అందులోనూ ఆర్ నారాయణమూర్తి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే పీపుల్స్ స్టార్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.