
తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత అంతటి అందగాడు, ఆజానుబాహుడు ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో అందరూ హరనాథ్ పేరు చెప్పేవారు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి వరుసలో నేనున్నానంటూ నిరూపించుకున్నారు హరనాథ్. అయితే, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అలా కాకుండా ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బాట పడితే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుందనేందుకు ఆయన జీవితం నిదర్శనం. హీరోగా గుర్తింపు తెచ్చుకొని పరిశ్రమలో బిజీ అవుతున్న తరుణంలో వ్యసనాలకు లోనైన హరనాథ్ చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నారు.
ఆయన పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథరాజు. ఆయన తండ్రి వరహాల రాజు కూడా నటుడే. అక్కినేని నటించిన మాయాలోకం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు. హరనాథ్ తొలి చిత్రం మాయింటి మహాలక్ష్మి. అయితే, ఆయన కెమెరా ముందు నిలుచున్న మొదటి సినిమా ఋష్యశృంగ. ఆ తర్వాత భక్త శబరి, మనోరమ, సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి తదితర చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే నటరత్న ఎన్టీఆర్ సీతారామకళ్యాణం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాముడి వేషానికి యువతరం నటుడిని ఎంపిక చేయాలని ఎన్టీఆర్ భావించారు. ఒకరోజు పాండీబజార్లో హరనాథ్ కనిపించగా, ఎన్టీఆర్ ఆయన్ను చూసి తన సినిమాలో రాముడి వేషం వేయమన్నారు. మేకప్ టెస్టులో పాల్గొని ఫెయిల్ అయితే కెరీర్ ఏమవుతుందోనని భయపడినా, తనపై తనకు నమ్మకం ఉందని హరనాథ్ ఎన్టీఆర్‌తో చెప్పారు. ఎన్టీఆర్ నవ్వేసి, స్వయంగా నుదుట తిలకం దిద్ది టెస్టుకు సిద్ధం చేశారు. చివరికి హరనాథ్ రాముడిగా ఎన్నికయ్యారు. లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేషగిరిరావు ఎంపికయ్యారు. పౌరాణిక పాత్రలు పోషిస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎంతో నిష్టగా ఉండేవారు. కానీ, హరనాథ్ రాముడి వేషం వేసుకుని సిగరెట్లు కాల్చేవారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు, మందలించారు కూడా. కానీ, ఎంత ప్రయత్నించినా హరనాథ్ ఆ బలహీనతను వదులుకోలేకపోయారు. సీతారామకళ్యాణం చిత్రంలో హరనాథ్ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ సంతోషించి తన మిత్రుడు బి.ఏ. సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు. ఆ సినిమాలో హరనాథ్ అందచందాలు అపురూపం.
హరనాథ్ అలవాట్లు తెలిసి కూడా ఒక మంచి నటుడని ప్రోత్సహించాలని ఎన్టీఆర్ అతనికి కొన్ని వేషాలు ఇప్పించారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో హరనాథ్ నటించిన పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, పుణ్యవతి, గుండమ్మ కథ, చిట్టి చెల్లెలు, నాదీ ఆడజన్మే, కలిసి ఉంటే కలదు సుఖం తదితర చిత్రాలన్నీ హిట్టే. ఎన్టీఆర్ నుంచి నటన పరంగా ఎంతో నేర్చుకున్న హరనాథ్ ఆయన క్రమశిక్షణను మాత్రం, అంకిత భావాన్ని మాత్రం అలవర్చుకోలేకపోయారు. 1961 నుండి 1972 వరకు తెలుగు సినిమాల్లో హరనాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. జమునతో వచ్చిన వివాదం కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆమెతో నటించడానికి నిరాకరించిన సమయంలో, హరనాథ్, జమున జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరనాథ్‌దే అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది.
సరిగ్గా అదే సమయంలో మత్తుకు అలవాటు పడ్డారు హరనాథ్. కొందరు జాగ్రత్తలు చెప్పినా వినలేనంత మైకం ఆయన్ని ఆవహించింది. ఎస్వీ రంగారావు, హరనాథ్ మధ్య ఆ రోజుల్లో మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ గొప్ప నటులే. నటనలో పోటీ పడితే బాగుండేది కానీ, వ్యసనంలో ఇద్దరూ పోటీపడ్డారు. హరనాథ్ కు వేషం ఇస్తే షూటింగ్‌కు వస్తారో రారో తెలియదు. ఒకవేళ వస్తే ఏ మూడ్‌లో ఉంటారో కూడా తెలియదు. ఈ కారణంగా ఒక్కొక్క సినిమా ఆయన చేయి జారిపోవడం మొదలైంది. ఆ సమయంలో వచ్చిన యువ హీరోలు కృష్ణ, శోభన్ బాబు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మందు మీదే తప్ప ముందుచూపు లేని హరనాథ్ పూర్తిగా వెనకబడ్డారు. ఒకప్పుడు బాగా సంపాదించి కార్లలో తిరిగిన హరనాథ్, ఈ వ్యసనం కారణంగా అంతా పోగొట్టుకొని బతకడానికి చివరకు చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు హరనాథ్ చివరి చిత్రం. హరనాథ్ కు ఒక కొడుకు శ్రీనివాసరాజు (నిర్మాతగా ప్రభాస్ తో రాఘవేంద్ర వంటి చిత్రాలు నిర్మించారు), ఒక కూతురు ఉన్నారు. హరనాథ్ అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతే, పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ వంటి చిత్రాలు నిర్మించారు.
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..