
హీరోయిన్ ఆమని తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, విడాకులు, మాతృత్వంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. చిన్నతనం నుండే హీరోయిన్ కావాలని కలలు కంటూ, అద్దంలో చూసుకొని మురిసిపోయినట్లు తెలిపారు. అయితే, సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అనేక తిరస్కరణలు, కష్టాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అప్పటి హీరోయిన్లు బొద్దుగా ఉండేవారని, తాను సన్నగా ఉండడం వల్ల “చాలా సన్నగా ఉన్నావు, స్కూల్‌కి వెళ్లే పిల్లలా ఉన్నావు” అని చెప్పి పాత్రలు ఇవ్వకుండా తిరస్కరించేవారని గుర్తు చేసుకున్నారు. కొన్నిసార్లు “గెస్ట్‌హౌస్‌కి వస్తావా?” వంటి రిక్వెస్టులు కూడా వచ్చాయని, అందుకు నిరాకరిస్తే అవకాశాలు కోల్పోయానని వివరించారు.
ఈ కష్ట సమయాల్లో తన తల్లి అండగా నిలిచి ధైర్యం చెప్పిందని, దేవుడితో మొరపెట్టుకుంటూ ఏడ్చే సందర్భాలు కూడా ఉన్నాయని ఆమని తెలిపారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక తమిళ నిర్మాత ఖాజా మైదీన్‌ను వివాహం చేసుకున్నారు. తన రెండవ సినిమాకు ఆయనే నిర్మాత అని, కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తిగా కనిపించడంతో ఆయన్ను నమ్మి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఈ వివాహం లవ్ , అరేంజ్డ్ మ్యారేజ్‌ల కలయిక అని పేర్కొన్నారు. పెళ్లి సమయంలో సినిమాలు మానేయాలని షరతు పెట్టగా, తాను అంగీకరించానని తెలిపారు. అయితే, సినిమా మానేయవద్దని, ఇక్కడి వరకు రావడానికి పడిన కష్టాన్ని వృథా చేసుకోవద్దని తన తల్లి పదేపదే చెప్పినా వినలేదని, అది తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటని ఆమని ఇప్పుడు అంగీకరించారు.
సినిమాకు దూరమైన తర్వాత మంచి పాత్రలు వదులుకోవాల్సి వచ్చిందని, ఇంట్లో కూర్చోవడం తనకు నచ్చలేదని, తిరిగి నటించాలనే కోరిక బలంగా ఉండేదని ఆమని చెప్పారు. తన మాజీ భర్తకు సినిమా అంటే పిచ్చి ఉన్నప్పటికీ, తాను సినిమాలు చేయడం ఆయనకు ఇష్టం లేకపోవడం విడాకులకు ప్రధాన కారణమని వివరించారు. “సినిమా వద్దు అన్నారు అని చెప్పి నేను వదిలేశా” అని స్పష్టం చేశారు. వారి వివాహ జీవితం ఆరు నుంచి ఏడేళ్లు మాత్రమే కొనసాగిందని, దాదాపు పదేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నట్లు తెలిపారు. ఆమని, ఖాజా మైదీన్‌లకు ఇద్దరు పిల్లలున్నారు – ఒక బాబు, ఒక పాప. పిల్లలు ప్రస్తుతం ఏడవ, ఐదవ తరగతులు చదువుతున్నారు. విడాకుల అనంతరం పిల్లల పెంపకం బాధ్యత పూర్తిగా తానే చూసుకుంటున్నానని, వారే తన ప్రపంచమని ఆమని పేర్కొన్నారు. మాజీ భర్తతో ఎటువంటి బంధం లేదని, అవసరమైతే తప్ప సంప్రదించరని, పిల్లలతో కూడా ఆయనకు ప్రస్తుతానికి ఎటువంటి టచ్ లేదని చెప్పారు. ఖాజా మైదీన్ ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తున్నారని, రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించి, ఇప్పుడు తిరిగి పెద్ద స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఒక సందర్భంలో సినిమా విషయంలోనే తన మాజీ భర్త తనపై ఒకటి రెండు సార్లు చేయి చేసుకున్నారని కూడా ఆమని వెల్లడించారు. తన తల్లి జీవితంలో తనకంటే ఎక్కువగా అలసిపోయిందని, తనను పెంచడంలో, హీరోయిన్ చేయడంలో, ఇప్పుడు తన పిల్లలను చూసుకోవడంలో ఎంతో కష్టపడిందని భావోద్వేగంగా పంచుకున్నారు.