
గోదావరి జిల్లాల్లో చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకానికి విశేష ఆదరణ లభించింది. తెలుగుదనంతో, సహజ సంభాషణలతో, కన్యాశుల్కం నాటకం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నాటకంగా ఇది నిలిచింది. దాసం గోపాలకృష్ణ రాసిన ఈ నాటకం తొలి ప్రదర్శన 1952లో పాలకొల్లులో జరిగింది. ఈ నాటకంలో చిట్టెమ్మ పాత్రను పోషించిన రత్నకుమారి, ఆ తర్వాత చిత్రరంగ ప్రవేశం చేసి కళాభినేత్రి వాణిశ్రీగా ఒక వెలుగు వెలిగారు. మద్రాసులోని ఆంధ్ర క్లబ్‌లో జరిగిన నాటక ప్రదర్శనలో కన్నడ దర్శకుడు హన్సూర్ కృష్ణమూర్తి, రత్నకుమారి నటనకు ముగ్ధులై, ఆమెకు తన వీర సంకల్ప చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నాటకాన్ని సినిమాగా తీసే ప్రయత్నం తొలిసారిగా 1965లో జరిగింది. ఆ సమయంలో వాణిశ్రీ చిట్టెమ్మగా, కృష్ణంరాజు దత్తుడిగా, ఎస్వీఆర్ సీతయ్యగా, అల్లు రామలింగయ్య పువ్వుల పున్నయ్యగా అనుకుని చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆర్టిస్టులను సంప్రదించినప్పటికీ, అనుకోని అవాంతరాల వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పోడూరు ఆర్.ఎస్. రాజుగారికి ఈ నాటకాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన మళ్లీ కలిగింది. గతంలో వరవిక్రయం, చింతామణి, కన్యాశుల్కం వంటి నాటకాలు సినిమాలుగా వచ్చినా, ఆ తర్వాత రంగస్థల నాటకాలను వెండితెరకు మలిచే సాహసం ఎవరూ చేయలేకపోయారు.
అయితే, రంగస్థలం పునాదిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన వ్యక్తి కావడంతో, నాటకాల మీద ఉన్న మమకారంతో దర్శకరత్న దాసరి నారాయణరావు “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకానికి చిత్రరూపం ఇవ్వడానికి, దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. అంతవరకు తన చిత్రాలకు స్వయంగా కథా మాటలు రాసుకునే దాసరి, తొలిసారిగా మరో రచయితకు మాటలు రాసే అవకాశం ఇవ్వడం ఈ సినిమాతోనే మొదలైంది. నాటకాన్ని అద్భుతంగా రాసిన దాసం గోపాలకృష్ణను రచయితగా దాసరి సినీ రంగానికి పరిచయం చేశారు. అంతేకాకుండా, గోపాలకృష్ణతో మూడు పాటలు కూడా రాయించారు. నాటకంలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన డబుల్ మీనింగ్ డైలాగులను, చిట్టెమ్మ, సీతయ్య, దత్తుడు పాత్రల్లో ఉన్న అశ్లీలత, అవాంఛనీయ ధోరణులను తొలగించి, వాటిని ఉదాత్తంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకరత్న దాసరి.
“చిల్లరకొట్టు చిట్టెమ్మ” చిత్రం షూటింగ్ 1977 ఏప్రిల్ 10న కాకినాడలో మొదలైంది. యానాం పరిసర గ్రామాల్లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటిస్తున్న ఎదురీత చిత్రం షూటింగ్ కూడా యానాంలో జరగడం ఒక విశేషం. “చిల్లరకొట్టు చిట్టెమ్మ” లో బడ్జెట్ సినిమా కావడంతో తక్కువమంది యూనిట్ సభ్యులతో పెద్ద హడావుడి లేకుండా షూటింగ్ జరిగేది. జయచిత్ర ఈ సినిమాలో చిట్టెమ్మ పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆమె చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు తన తల్లి జయశ్రీ, వాణిశ్రీ కలిసి నటించిన నాటకం కావడంతో “చిల్లరకొట్టు చిట్టెమ్మ” సినిమాలో నటించడానికి అంగీకరించారు. తూర్పుగోదావరి జిల్లా యాస నేర్చుకుని ఆమె అద్భుతంగా నటించారు. దత్తుడు పాత్రను మురళీమోహన్ పోషించగా, కీలకమైన జీళ్ల సీతయ్య పాత్రను వర్ధమాన నటుడు గోకిన రామారావుకు ఇచ్చి దాసరి ప్రోత్సహించారు. ఇక మాడా పోషించిన పువ్వుల పున్నయ్య పాత్ర తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ముత్యాల ముగ్గు చిత్రం మాడాకు మంచి గుర్తింపు తీసుకువస్తే, “చిల్లరకొట్టు చిట్టెమ్మ” ఆయన పేరుని తెలుగు సినీ చరిత్రలో పదిలం చేసింది. “చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు” అనే పాటలో బాలు గానం, మాడా అభినయం ఇప్పటికీ మర్చిపోలేనివి.
దాసరి ఆస్థాన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ చిత్రానికి సంగీతం అందించారు. తక్కువ బడ్జెట్‌లో పాటలు చేసి ఇవ్వాలని దాసరి కోరగా, కేవలం 25 వేల రూపాయలతో రమేష్ నాయుడు చిత్రంలోని అన్ని పాటలను రికార్డు చేసి ఇచ్చారు. సి.నారాయణరెడ్డి రాసిన “సువ్వి కస్తూరిరంగా సువ్వి” జానపద బాణీలో ఒక చక్కని పాటగా నిలిచింది. అలాగే, “తల్లి గోదావరికే ఆటుపోటు ఉంటే తప్పుతుందా మనిషికి” అనే పాటను రమేష్ నాయుడు స్వయంగా పాడి ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. నాటకాలు వేసే రోజుల్లో పువ్వుల పున్నయ్య పాత్రను దాసరి స్వయంగా పోషించేవారు. సినిమాలో కూడా ఆ పాత్రను తనే పోషించాలని దాసరి మొదట అనుకున్నా, దర్శకుడిగా తన బిజీ షెడ్యూల్ కారణంగా నటించలేకపోయారు. ఐదు లక్షల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న “చిల్లరకొట్టు చిట్టెమ్మ” చిత్రం 1977 అక్టోబర్ 7న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడి, హైదరాబాద్‌లో 225 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చెన్నై ఉడ్‌ల్యాండ్ హోటల్‌లో జరిగిన విజయోత్సవానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..