మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్‌నెస్, మెరిసే చర్మం సీక్రెట్స్ రివీల్.. కొవ్వు పెరగడానికి కారణం అదే!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన గ్లామర్ తో మాయ చేస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా.. తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటర్నెట్‌లో రోజూ వచ్చే కొత్త కొత్త డైట్ ప్లాన్లు, వర్కవుట్ ట్రెండ్స్ చూసి చాలామంది మోసపోతుంటారు.
కానీ ఈ మిల్కీ బ్యూటీ మాత్రం తన ట్రైనర్ చెప్పే సైంటిఫిక్ పద్ధతులనే పాటిస్తుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్ గురు సిద్ధార్థ్ సింగ్.. త్వరగా బరువు తగ్గాలని చూసే వారికి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పారు. మనం గొప్పగా భావించే కొన్ని అలవాట్లు మన శరీరాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
త్వరగా బరువు తగ్గాలని చాలామంది కార్బోహైడ్రేట్లను (పిండి పదార్థాలు) పూర్తిగా మానేస్తుంటారు. దీనిపై సిద్ధార్థ్ హెచ్చరిస్తూ.. “కార్బ్స్ మానేస్తే బరువు వేగంగా తగ్గుతారు కానీ, మీ శరీరంలోని హార్మోన్లు దెబ్బతింటాయి. విపరీతమైన ఆకలి మిమ్మల్ని వేధిస్తుంది. దీనికి బదులుగా క్యాలరీ డెఫిసిట్ పాటించండి. తగినంత ప్రోటీన్ తీసుకుంటూనే, కార్బ్స్ ను కూడా ఆస్వాదించండి” అని సూచించారు.
మార్కెట్లో దొరికే డిటాక్స్ టీలు, క్లెన్సింగ్ ప్రొడక్ట్స్ అన్నీ మోసపూరితమైనవని సిద్ధార్థ్ కుండబద్దలు కొట్టారు. “ఏ టీ లేదా సప్లిమెంట్ మీ శరీరాన్ని డిటాక్స్ చేయలేదు. మన శరీరంలోనే సహజమైన డిటాక్స్ వ్యవస్థ ఉంటుంది. దానికి మద్దతుగా ఫైబర్ ఉన్న ఆహారం, ప్రోటీన్ తీసుకోవాలి. రోజుకు తగినన్ని అడుగులు నడవాలి. మేజిక్ పిల్స్ కోసం వెతకడం మానేసి బేసిక్స్ మీద దృష్టి పెట్టండి” అని ఆయన చెప్పుకొచ్చారు.
బిజీ లైఫ్ వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుందని సిద్ధార్థ్ హెచ్చరించారు. “నిద్ర తక్కువైతే ఆకలి పెరుగుతుంది, శరీరం రికవరీ అవ్వడం కష్టమవుతుంది. ఇది చివరికి మీరు ఎక్కువ కొవ్వును స్టోర్ చేసుకునేలా చేస్తుంది. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ ఉన్నవారు రోజుకు 7-8 గంటల గాఢ నిద్రను అస్సలు వదులుకోకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.
మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి బాడీ కావాలంటే షార్ట్ కట్స్ వెతకడం మానేయాలి. సిద్ధార్థ్ సింగ్ చెప్పినట్లుగా సహజమైన పద్ధతుల్లో, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలి. అనవసరమైన సప్లిమెంట్ల జోలికి వెళ్లకుండా, సరైన ఆహారం.. సరైన నిద్రతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.