
ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పలు ఓటీటీ సంస్థలు కూడా పలు మలయాళ సినిమాలను ఆయా ప్రేక్షకులకు తగ్గట్టుగా డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళ సూపర్ హిట్ సినిమా సిద్ధమైంది. అదే సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గురువాయుర్ అంబలనాదయిల్’. విపిన్ దాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ కామెడీ డ్రామాలో సిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 16న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లు సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘గురువాయుర్ అంబలనాదయిల్’ ఏకంగా రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘గురువాయుర్ అంబలనాదయిల్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.