OTT Movie: చిన్నారి మిస్సింగ్‌లో మతిపోయే ట్విస్టులు.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

ఒక చిన్నారి అదృశ్యం కావడం, అదే సమయంలో మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ తిరుగుతుంది. మరి ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఏమిటి? చిన్నారి మిస్సింగ్ లో తేలిందేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

OTT Movie: చిన్నారి మిస్సింగ్‌లో మతిపోయే ట్విస్టులు.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Nov 26, 2026 | 7:09 AM

ప్రేక్షకులకు విభిన్న కథాంశాలతో కూడిన వినోదాన్ని అందిస్తున్న ఓటీటీ వేదిక జీ5 మరో ఆసక్తికరమైన చిత్రంతో ముందుకొస్తోంది. జితేంద్ర కుమార్‌, ప్రియ బాపట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘దాలింబ్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుదల చేశారు. ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో ప్రియా అవెన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 4 నుంచి ప్రత్యేకంగా హిందీ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ముంబయి శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం కావడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కేసుల దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా సాగుతుంది. జితేంద్ర కుమార్‌ గతంలో ఎన్నడూ కనిపించని భిన్నమైన పాత్రలో నటించగా.. ప్రియ బాపట్‌ పోలీసు ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. సాధారణంగా కనిపించే ఇళ్ల వెనుక, మనకు పరిచయమైన పరిసరాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయనే అంశాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. పైకి కనిపించే జీవితాలకు, తెర వెనుక ఉన్న వాస్తవాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో చూపించనుంది. భయం, ప్రేమ, నష్టం, అనిశ్చితి వంటి భావోద్వేగాల సమ్మేళనంతో ట్రైలర్‌ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

రెండు మిస్టరీల చుట్టూ కథ..

‘దాలింబ్‌’లో ప్రధానంగా రెండు రహస్యాలు కీలకంగా ఉంటాయి. ఒక చిన్నారి కనిపించకుండా పోవడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి పారిపోవడం.. ఈ రెండు ఘటనలతో కథ మొదలవుతుంది. వాటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకునే క్రమంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. సంబంధాలు, వ్యక్తిగత జీవితాలు, దాచిపెట్టిన రహస్యాలు కథలో కీలకంగా మారతాయి. మొదట సులభంగా కనిపించే ఈ కేసులు క్రమంగా సంక్లిష్టంగా మారి.. అసలు నిజం ఏమిటనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతాయి. వాస్తవం, అపోహల మధ్య సరిహద్దులు చెరిగిపోయేలా కథనం సాగుతుందని చిత్ర బృందం తెలిపింది.

‘దాలింబ్‌’ ప్రత్యేకతలు..

ఇవి కూడా చదవండి

రెండు ఆసక్తికరమైన మిస్టరీలు: అదృశ్యమైన చిన్నారి, మానసిక చికిత్స కేంద్రం నుంచి తప్పించుకున్న వ్యక్తి.. ఈ రెండు ఘటనల చుట్టూ సాగే దర్యాప్తు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది.

ఆలోచింపజేసే కథనం: సాధారణ థ్రిల్లర్‌ చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకుల ఆలోచనలను ప్రశ్నించేలా, కథ ముగిసిన తర్వాత కూడా గుర్తుండిపోయేలా చిత్రాన్ని రూపొందించారు.

పైకి కనిపించేదే నిజం కాదు: మనకు పరిచయమైన వ్యక్తులు, పరిసరాల వెనుక ఎలాంటి జీవితాలు, రహస్యాలు దాగి ఉంటాయనే అంశాన్ని ఈ చిత్రం చర్చిస్తుంది.

సమయంతో పోరాటం: రెండు మిస్టరీలకు సమాధానాలు వెతికే క్రమంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

విభిన్నమైన ప్రధాన పాత్రలు: జితేంద్ర కుమార్‌, ప్రియ బాపట్‌ గతంలో ఎన్నడూ పోషించని పాత్రల్లో కనిపించనున్నారు. వారి నటన కథకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

దర్శకురాలు ప్రియా అవెన్‌ మాట్లాడుతూ.. ‘‘దాలింబ్‌’తో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాం. ఇందులో మిస్టరీ కేవలం దర్యాప్తు ద్వారానే కాకుండా.. అందులో భాగమైన వ్యక్తుల భావోద్వేగాలు, ఆందోళనలు, అనిశ్చితుల ద్వారా కూడా బయటపడుతుంది. కథకు తగినట్లుగా ప్రత్యేకమైన విజువల్‌ శైలి, సౌండ్‌ డిజైన్‌పై మా బృందం ఎంతో శ్రద్ధ పెట్టింది. సూరాజ్‌ పాత్రలో జితేంద్ర కుమార్‌ అద్భుతంగా ఒదిగిపోయారు. ప్రేక్షకులు ఆయనలో ఇంతకు ముందు చూడని కోణాన్ని ఈ పాత్రలో చూస్తారు. నిమిషా పాత్ర కోసం ప్రియ బాపట్‌ ఎంతో సహజంగా తనను తాను మలుచుకున్నారు. కథపై, నా ఆలోచనలపై నమ్మకం ఉంచిన ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన తనూజ్‌ గార్గ్‌కు కృతజ్ఞతలు. డిసెంబరు 4న ప్రేక్షకులు ‘దాలింబ్‌’ ప్రపంచాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

నటుడు జితేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘దాలింబ్‌’ కథలోని ఆసక్తికరమైన నేపథ్యం, కథ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడే అనేక అంశాలు నన్ను ఆకట్టుకున్నాయి. మనకు తెలిసిన విషయాలనే మరోసారి ప్రశ్నించేలా, పాత్రల గురించి మన అభిప్రాయాలను మార్చేలా ఈ కథ ఉంటుంది. నా పాత్రలో భావోద్వేగపరంగా ఎన్నో కోణాలు ఉన్నాయి. అదే సమయంలో కథలోని ఉత్కంఠను కొనసాగించడం నటుడిగా మంచి అనుభవాన్నిచ్చింది. దర్శకురాలు ప్రియా అవెన్‌, ప్రియ బాపట్‌, చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఈ మిస్టరీని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను’’ అని తెలిపారు.

నటి ప్రియ బాపట్‌ మాట్లాడుతూ.. ‘‘దాలింబ్‌’ కథలో ఉత్కంఠతో పాటు మానవీయ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండటం నన్ను ఆకట్టుకుంది. ఇందులో కేవలం ఒక మిస్టరీని ఛేదించడం మాత్రమే కాకుండా.. దాని చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి పరిస్థితులను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమైన అంశం. నా పాత్రలో అనేక కోణాలు ఉన్నాయి. సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో అలాంటి భావోద్వేగాలను ఆవిష్కరించడం మంచి అనుభవం. దర్శకురాలు ప్రియా అవెన్‌, జితేంద్ర కుమార్‌, ఇతర చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. డిసెంబరు 4 నుంచి జీ5లో ప్రసారమయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

దాలింబ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us