Rakasa Movie Review: రాకాస మూవీ రివ్యూ.. నిహారిక నిర్మించిన ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉంది..?

కమిటీ కుర్రోళ్లు లాంటి క్లీన్ సినిమా తీసి నిర్మాతగా తన అభిరుచి చూపించింది నిహారిక కొణిదెల. ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి జీ స్టూడియోస్‌తో కలిసి చేసిన ప్రయత్నమే రాకాస. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Rakasa Movie Review: రాకాస మూవీ రివ్యూ.. నిహారిక నిర్మించిన ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉంది..?
Rakasa

Edited By:

Updated on: Apr 03, 2026 | 1:12 PM

మూవీ రివ్యూ: రాకాస

నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి తదితరులు

సినిమాటోగ్రఫీ: ఏడురోలు రాజు

ఎడిటింగ్: అణ్వర్ అలీ

సంగీతం: అనుదీప్ దేవ్

నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ భన్సాల్

దర్శకత్వం: మానస శర్మ

కథ:

జానపద కథలు, చందమామ కథల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఓ పాత కోట.. ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు నివసిస్తుంటాడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి ఆ రాక్షసుడు మూడు హెచ్చరికలు పంపుతాడు. మూడో హెచ్చరిక వచ్చేసరికి ఊరివాళ్లు ఒక మనిషిని అతనికి ఆహారంగా పంపాలి. లేదంటే ఊరిని నాశనం చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి అమెరికా నుంచి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఊరికి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్) ఊహించని పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి ఆహారంగా కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత లోపల ఏం జరిగింది? రాక్షసుడిని వీరబాబు ఎలా ఎదిరించాడు? మధ్యలో సుబ్బలక్ష్మి (నయన్ సారిక) ఎందుకొచ్చింది..? అసలు ఆ కోటలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..? అనేది మిగతా కథ.

కథనం:

చిన్నపుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్లం కదా.. అక్కడ ఓ కోట ఉందంట.. అందులో దెయ్యం ఉందంట.. బ్రహ్మ రాక్షసుడు వచ్చి మనషులను తినేస్తాడంట అని.. అచ్చంగా అలాంటి కథల నుంచి స్పూర్తి పొంది రాసుకున్న కథ ఇది. మానస శర్మ ఈ కథను రాసుకున్న తీరు కంటే దాన్ని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, సంగీత్ శోభన్ మార్క్ కామెడీ ట్రాక్స్, సరదా ఎలిమెంట్స్‌తో సినిమా చాలా లైట్ మూడ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చే ట్విస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్ అంతా నలుగురు చుట్టూనే కథ తిరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరో కోటలోకి వెళ్ళాక కథ కాస్త నెమ్మదించినట్లు, ఫ్లాట్‌గా మారినట్లు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ పాత్ర ఎంటర్ అయిందో అక్కడ్నుంచి మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఇక గెటప్ శ్రీను ఎంట్రీతో వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మళ్ళీ ట్రాక్‌లోకి తెస్తాయి. క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించని విధంగా ముగించారు. ఎమోషనల్ అండ్ డ్రామాతో బాగా ముగించారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రాజు ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.

నటీనటులు:

సంగీత్ శోభన్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో తన పరిధి మేరకు చక్కగా నటించింది నయన్ సారిక. వెన్నెల కిషోర్ & గెటప్ శ్రీను సెకండాఫ్‌లో వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోసింది. థియేటర్లలో వీళ్లు ఉన్నంత సేపు నవ్వులు పూస్తాయి. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పించాయి.

టెక్నికల్ టీం:

అనుదీప్ దేవ్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) మాత్రం ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. రన్ టైమ్ చాలా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్. ఇక దర్శకురాలు మానస శర్మ మొదటి సినిమాతోనే మెప్పించింది. విట్టలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్‌ను ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు. సెకండాఫ్‌లో చిన్నపాటి తడబాటు ఉన్నా, ఓవరాల్‌గా డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశారు. నిర్మాణ విలువలు ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. బడ్జెట్ పరిమితుల్లోనే VFX, రాక్షసుడి డిజైన్ వంటివి చాలా నీట్‌గా తీసుకువచ్చారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రాకాస.. ఫన్ ఫాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్.. నో లాజిక్ ఓన్లీ కామెడీ..!

Follow Us