
మూవీ రివ్యూ: మా ఇంటి బంగారం
నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, చైతన్య కృష్ణ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకారాల
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
కథ, స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు
నిర్మాణ సంస్థ: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
దర్శకురాలు: నందిని రెడ్డి
కథ:
స్వర్ణ ఊరఫ్ ఝాన్సీ (సమంత) ఒక అనాధ. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటుంది. అలా ఒక పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ (దిగంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు వాళ్లను దూరం పెడుతుంది ఆ కుటుంబం. పెళ్లయిన మూడు సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఒక శుభకార్యం కోసం మళ్లీ తిరిగి వస్తారు స్వర్ణ, ఆమె భర్త. తక్కువ సమయంలోనే ఇంట్లో వాళ్లతో కలిసిపోతుంది స్వర్ణ. కానీ స్వర్ణ గతం ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణ (గుల్షన్ దేవయ్య) తో ఉన్న వైరం స్వర్ణ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. తన కుటుంబం కోసం అప్పుడు ఆమె ఏం చేసింది.. వాళ్లకు తన గతం చెప్పి ఎలా వాళ్లను కాపాడుకుంది అనేది మిగిలిన కథ.
కథనం:
వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. ఒక పెద్ద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన ఈమెకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతి సీన్ జరిగే ముందు.. ఈమె ఎవరో తెలుసా అనే రేంజ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఇంటర్వెల్ వరకు ఇలాంటి కథతోనే నడిపించింది డైరెక్టర్ నందిని రెడ్డి. అక్కడక్కడ అలాంటి ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ సన్నివేశాలతోనే నడిచింది. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా కూడా రాజ్ నిడిమోరు రేంజ్ రైటింగ్ మాత్రం కనిపించలేదు.
ఇంటర్వెల్ కు కాస్త కథ గాడిన పడుతుంది. సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగానే మొదలైన యాక్షన్ సన్నివేశాలతో ఊపు అందుకుంటుంది. సమంత ఎవరో తెలిసిపోయిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు సమంత మేకోవర్ అదిరిపోయింది.. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఆమెకు ఎలివేషన్స్ ఇచ్చారు.. అవి వర్కౌట్ అయ్యాయి కూడా. కాకపోతే ఈ సినిమాకు నా ప్రధానమైన మైనస్ రొటీన్ కథ.. ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాసాడు రాజ్. తన స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో బాగానే ఉన్నాయి. సమంత ఇమేజ్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తున్నది రొటీన్ కథ అయినా కూడా స్క్రీన్ ప్లే ఓ మోస్తారుగా ఉండడం మా ఇంటి బంగారం కు బాగా కలిసి వచ్చే విషయం. మెరిసేది మొత్తం బంగారం కాకపోయినా కోటింగ్ మాత్రం బాగానే ఇచ్చారు. కాకపోతే విలన్ ట్రాక్ ఇంకాస్త బలంగా పెట్టి ఉంటే బాగుండేది.
నటీనటులు:
తనవరకు సమంత పూర్తి న్యాయం చేసింది.. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్ని ఆమె. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది.
గుల్షన్ దేవయ్య విలనిజం చాలా వీక్.. ఇంకాస్త బెటర్ గా ఉండుంటే బాగుండేది. చైతన్య కృష్ణ, శ్రీముఖి, శ్రీ లక్ష్మీ, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి వీళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సమంత భర్త పాత్రలో ఎవరైనా పరిచయం ఉన్న నటువంటిని పెట్టి ఉంటే బాగుండేది. ఆ పాత్రలో దిగంత్ బాగున్నాడు.. బాగా నటించాడు కూడా.
టెక్నికల్ టీం:
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. వెబ్ సిరీస్ మాదిరి అక్కడక్కడ కాస్త నెమ్మదించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్టర్ నందిని రెడ్డి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్టోరీ రన్నర్ రాజ్ నిడిమోరు తీసుకున్న కథ పాతదే కానీ స్క్రీన్ ప్లే బాగుంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా మా ఇంటి బంగారం.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. సమంత కోసం..!