
ఇది కేవలం ఒక డ్యాన్స్ మాత్రమే కాదు, శరీరాన్ని ఉక్కులా మార్చే ఒక గొప్ప వ్యాయామం అని ఆమె నిరూపిస్తోంది. సామాన్యులకు ఇది కొంచెం కష్టంగా అనిపించినా, సరైన పద్ధతిలో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ గ్లామర్ బ్యూటీ మరెవరో కాదు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. పోల్ డ్యాన్స్ ద్వారా ఆమె పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఈ వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం..
జస్లోక్ హాస్పిటల్ కు చెందిన ఫిజియోథెరపీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. పోల్ డ్యాన్స్ అనేది ఒక అద్భుతమైన ఫిట్‌నెస్ డిసిప్లిన్. ఇది కేవలం వినోదం కోసం చేసేది కాదు, దీనివల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మధ్య భాగాన్ని అత్యంత దృఢంగా మారుస్తుంది. చేతులు, కాళ్లు, భుజాల కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. శరీరం రబ్బరులా వంగేలా చేస్తుంది.
దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీర సమతుల్యతను పెంచి, మనం నడిచే తీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సంగీతంతో కలిసి ఈ వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి వయసు వారు దీనిని ప్రయత్నించవచ్చని, ఇది శరీర అవగాహనను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వారి వ్యక్తిగత ఎదుగుదలకు ఈ పోల్ డ్యాన్స్ ఎంతో దోహదపడుతుంది.
పోల్ డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి
వెన్నెముక సమస్యలు, కీళ్ల నొప్పులు, శరీర సమతుల్యత సరిగా లేనివారు మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు పోల్ డ్యాన్స్ కు దూరంగా ఉండటం లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే చర్మం సెన్సిటివ్ గా ఉన్నవారు, పాత గాయాల నుంచి కోలుకుంటున్న వారు కూడా ఈ వ్యాయామం చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాగా ఫిట్‌గా ఉండాలని ఎవరికి ఉండదు? కానీ అలాంటి బాడీని సాధించడానికి ఆమె పడే కష్టం, చూపే క్రమశిక్షణే ఆమెను ఈరోజు ఫిట్‌నెస్ ఐకాన్ గా నిలబెట్టాయి. పోల్ డ్యాన్స్ అనేది ఒక కొత్త ట్రెండ్ మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి మంచి ఔషధం కూడా అంటున్నారు నిపుణులు.