
దర్శకుడు సంపత్ నంది ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలైన భోగి, గౌతమ్ నంద గురించి, అలాగే తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి లోతైన విషయాలను పంచుకున్నారు. సుమారు మూడేళ్లపాటు ఒకే ప్రాజెక్ట్, భోగి పై పనిచేయడం ఒక సవాల్ అని ఆయన తెలిపారు. ఈ సమయంలో శర్వా గారి నుంచి తనకు సంపూర్ణ సహకారం లభించిందని, ఆయన నమ్మకం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. మధ్యలో నాని, బైకర్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల భోగి నిర్మాణంలోనూ జాప్యం జరిగిందని సంపత్ నంది వెల్లడించారు. సినిమాల్లో పెరుగుతున్న హింస గురించి ఆందోళన చెందుతున్న ప్రేక్షకులకు భోగి ఒక వినూత్న అనుభూతిని ఇస్తుందని సంపత్ నంది హామీ ఇచ్చారు. భోగిలో హింస కేవలం కథలో భాగమే అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో రక్తపాత సన్నివేశాలు ఉన్నప్పటికీ, అవి బలవంతంగా చూపించినవి కావు. కథాగమనం ద్వారానే అవి వస్తాయని, ముఖ్యంగా ఆ హింసాత్మక సన్నివేశాలను చూడడానికి ప్రేక్షకులు కనీసం ఒక గంట ఎదురుచూడాల్సి ఉంటుందని, ఇది కథకు బరువును, భావోద్వేగాన్ని జోడిస్తుందని ఆయన వివరించారు. ఈ విషయంలో తనకు ఎటువంటి భయం లేదని, భోగి చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.
తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, “ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకా బాగా రాయి, ఇంకా మంచి రిసెప్షన్ ఉంటది” అని తన అనుభవాలు నేర్పించాయని సంపత్ నంది పేర్కొన్నారు. తాను ఎప్పుడూ “ఇది చాల్లే” అనే మనస్తత్వంతో ఉండనని, ప్రతి స్క్రిప్ట్‌ను, ప్రతి షాట్‌ను ఎంతో శ్రద్ధగా తయారుచేస్తానని తెలిపారు. అయితే, కొన్నిసార్లు తన పరిమితులు, జ్ఞానం, ఎక్స్పోజర్ పరిగణనలోకి తీసుకుని బయటికి వదులుతామే తప్ప, కావాలని ఎప్పుడూ తక్కువ పని చేయనని ఆయన అన్నారు. ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి వచ్చే ప్రతి అభిప్రాయాన్ని తాను స్వాగతిస్తానని, వాటిని సరిదిద్దుకుంటూనే తాను ముందుకు సాగుతున్నానని సంపత్ నంది వెల్లడించారు. ఈ నిరంతర అభ్యాసం వల్లే తాను ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయగలుగుతున్నానని ఆయన అన్నారు.
గౌతమ్ నంద చిత్రం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని, ఆ సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోయినా, కాలక్రమేణా అది ఒక కల్ట్ క్లాసిక్‌గా మారిందని సంపత్ నంది గుర్తుచేసుకున్నారు. “ఆరోజు కూడా థియేటర్లో చూసినప్పుడు కూడా నాకు నచ్చింది. మరి మీరు ఎందుకు మంచి రివ్యూ చేయలేదు అప్పుడు?” అని ఆయన మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆ సినిమా అప్పుడు ప్రేక్షకులకు నచ్చిందని, ఇప్పుడు కూడా నచ్చిందని, అందుకే అది కల్ట్ క్లాసిక్ అయి కూర్చుందని ఆయన తెలిపారు. గౌతమ్ నంద సినిమాలోని మొదటి 35 నిమిషాలు, చివరి 35 నిమిషాల్లోని ప్రతి షాట్‌ను తానే స్వయంగా డిజైన్ చేసుకున్నానని, అంత స్టైలిష్‌గా, ఇంత కొత్తగా మళ్ళీ ఇప్పటివరకు తాను ఏ సినిమా చేయలేదని ఆయన చెప్పారు. తన ఫిల్మోగ్రఫీలో గౌతమ్ నంద ఇప్పుడు టాప్ స్థానంలో ఉందని సంపత్ నంది ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..