
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో మరో మహిళతో రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తన భార్య యాస్మిన్‌ను కారుతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. అక్టోబర్ 10న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శర్మ జీ కి లాగ్ గయీ, దేహతి డిస్కో, ఖలీ బాలి తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు కమల్ కుమార్. అయితే ఇటీవల ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల అంధేరిలోని ఓ ఇంటి పార్కింగ్ స్థలంలో సదరు మహిళతో కారులో సన్నిహితంగా ఉండడం ఆయన భార్య చూసింది. ఈ విషయమై ఆయనను నిలదీసేందుకు కారు దగ్గరికి వెళ్లింది. కారు దిగమని చెబుతున్నా ఆయన తలుపు తీయకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు పడ్డ మిశ్రా వెంటనే కారు ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో కారు ఆమెను ఢీకోట్టడంతో ఆమె కిందపడిపోయింది. అయినా కిశోర్ కారు ఆపకుండా భార్య కాళ్లపై నుంచి కారును ముందుకు పోనిచ్చాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి ఆమెను కాపాడాడు. ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భర్త తనను చంపాలని ప్రయత్నించాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో 279 (ర్యాష్ డ్రైవింగ్) మరియు 337 ( వ్యక్తి జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం) సహా భారతీయ శిక్షాస్మృతి (IPC) సంబంధిత సెక్షన్ల కింద అంబోలి పోలీసులు మిశ్రాపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ సంఘటనపై కమల్ భార్య మాట్లాడుతూ ‘ నాభర్త కనీస మానవత్వం కూడా ప్రదర్శించలేదు. నేను బతికే ఉన్నానా, చనిపోయానా అని కారు దిగి కూడా చూడలేదు. మా మధ్య 9 ఏళ్ల అనుబంధం ఉంది కానీ ఆ వ్యక్తి 9 సెకన్లు కూడా నా గురించి ఆలోచించలేదు. కమల్‌కు పలువురి మోడల్స్‌తో వివాహేతర సంబంధాలున్నాయి. ఆయన చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి జీవితాలను చెడగొట్టాడు’ అని సంచలన ఆరోపణలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..