Bengal Elections: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ, టీఎంసీ

|

Mar 31, 2021 | 9:51 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రెండో దశ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్ల తీర్పు ఏంటి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Bengal Elections: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ, టీఎంసీ
West Bengal Elections 2021
Follow us on

West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది . రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగియడంతో గురువారం పోలింగ్ నాడు ఓటర్ల తీర్పు ఏంటి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ , తనపై దాడి జరిగిన తర్వాత కాలికి అయిన గాయం వల్ల వీల్‌చైర్‌లోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు బీజేపీకి మద్దతుగా అగ్రనేతలందరూ బెంగాల్‌లో మకాం వేశారు.

రెండో దశలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రాం నియోజకవర్గం కూడా ఉండటం అందరి దృష్టి బెంగాల్‌పైనే పడింది. నందిగ్రాంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలలో కమలనాథులుంటే, మరోసారి సత్తా చాటి పట్టు నిలబెట్టుకోవాలన్న పంతంతో టీఎంసీ అధినేత్రి మమత ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ రెండు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో ప్రత్యేక వ్యుహంతో ముందుకు వెళ్తోంది. అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకుని కాషాయం జెండా రెపరెపలాడించేందుకు పక్కా ఫ్లాన్‌తో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సఫలమయ్యారు. తాజా జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలను కూడా యుద్ధంగానే పరిగణిస్తుంది. అందుకే ప్రత్యర్థి పార్టీ అధినేతలు పోటీచేసే స్థానాలపైనే గట్టిగా గురిపెడుతుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఇదే యుద్ధ తంత్రాన్ని అనుసరించింది. తన రాజకీయ ప్రత్యర్థి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పోటీచేసే అమేథీ నియోజకవర్గంపై తమ ఆయుధాలను ఎక్కుపెట్టింది. రాష్ట్రమంతా తీవ్ర ప్రతికూలంగా ఉన్నా సరే రాయ్ బరేలి, అమేథీ నియోజకవర్గాల్లో తల్లీకొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందుతూ వచ్చేవారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఐదేళ్ల పాలన పూర్తిచేసిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కే కలిసిరావాలి. కానీ, బీజేపీ రచించిన వ్యూహాలు, అనుసరించిన విధానాలు రాహుల్ గాంధీనే ఓడించేలా చేశాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేలా చేశాయి.

సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యుహాన్నే ఇప్పడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. అందుకే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రాం నియోజకవర్గంపై బీజేపీ అన్ని అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఒకే దెబ్బతో ప్రత్యర్థిని బలహీనపరుస్తూ తాను బలపడే వ్యూహాన్ని కూడా అమలు చేసింది. ప్రత్యర్థి పార్టీలో బలమైన నేతను తమవైపు లాక్కుంటే, ఏకకాలంలో ప్రత్యర్థి పార్టీ బలహీనపడడంతో పాటు తమ పార్టీ బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగానే టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత బలమైన నేతల్లో ఒకరైన సువేందు అధికారిని బీజేపీ తమవైపు లాక్కుని, మమత బెనర్జీపైనే పోటీకి నిలబెట్టింది.

నిజానికి నందిగ్రాం నియోజకవర్గం మొదటి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. 1967 నుంచి 8 సార్లు కమ్యూనిస్టులు గెలవగా, కాంగ్రెస్ 2 సార్లు గెలుపొందింది. 1977లో జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది. 2009 నుంచి వరుసగా తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ తరఫున సువేందు అధికారి ఏకంగా 67.2 శాతం ఓట్లు సంపాదించి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ పోటీచేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. పార్టీ పరంగా చూస్తే గత 3 పర్యాయాలుగా టీఎంసీ గెలుస్తూ వస్తోంది. పైగా టీఎంసీ అధినేత్రి, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ పోటీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గెలుపు సునాయాసమేనని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కమలనాథులు మాత్రం గెలుపు తమదే అంటున్నారు. అంతేకాదు, 50 వేల మెజారిటీతో మమతను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నందిగ్రాంలో పోరు మాత్రం రసవత్తరంగా మారింది. బేగంకు ఓటేస్తే బెంగాల్ మినీ పాకిస్తాన్‌గా మారుతుందంటూ ఎన్నికల ప్రచారంలో మమతను ఉద్దేశించి సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఓట్లను పోలరైజ్ చేయడం కోసమేనని అర్థమవుతోంది. నందిగ్రాంలో జరిగే ప్రతి సన్నివేశం, ఘటన ప్రభావం మిగతా రాష్ట్రమంతటా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నందిగ్రాం వేదికగా జరుగుతున్న యుద్ధంలో ఇటు బీజేపీ, అటు టీఎంసీ హోరాహోరిగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి.

ఇక, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్‌లో సెక్షన్ 144ను ఎన్నికల కమిషన్ విధించింది. మొత్తం 8 విడతల పోలింగ్‌లో భాగంగా రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1న జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి హోరాహోరీ తలపడుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా నందిగ్రామ్‌లో 144 సెక్షన్‌ను ఈసీ విధించింది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. హింస, శాంతి భద్రతల విఘాతం, అనుచిత ఘటనలకు అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చినట్టు హల్దియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అవ్నీత్ పునియా తెలిపారు.

Read Also…  తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ కు కోపమొచ్చింది.. చేతిలో ఉన్న పార్టీ గుర్తును విసిరికొట్టాడు..!