West Bengal election 2021: గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఆరో దశ పోలింగ్‌కు సిద్ధమవుతుండగా, మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు సంభవించాయి.. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.
24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జీసీ రోడ్‌లో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడగా.. రాజ్‌కిశోర్ జాదవ్(28) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆరో విడత పోలింగ్ జరగనున్న బరాక్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తితాగఢ్‌లో ఎన్‌జేఎంసీ పత్తి మిల్లు ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులతో దాడి చేశారు. బీజేపీ నేత సంతోష్ జేనా ఇంటిని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జగత్‌దల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భట్‌పారా ప్రాంతంలోనూ నాటు బాంబుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో నాటు బాంబులు విసిరారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘాతుకానికి వెనుక బీజేపీ నేతలే ఉన్నారని స్థానిక టీఎంసీ నేతలు ఆరోపించారు. అయితే, పోలీసులు మాత్రం అక్కడ ఎలాంటి బాంబులు దొరకలేదని స్పష్టం చేశారు. జగత్‌దల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ గురువారం పోలింగ్ జరగనుంది.
బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆరో విడత పోలింగ్ జరగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నాలుగో,ఐదో విడత ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారడంతో ఈసీ మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1,071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.