పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ఫలితాలు 2024
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లాలో బలమైన కీలక నేత. చదువుకునే రోజుల్లోనే విద్యార్ధి సంఘం నాయకునిగా ఎదిగారు. 1978లో జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 1985, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీలేరు శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటికే మూడు సార్లు రాజకీయంగా పరాజయాన్ని చూసిన పెద్దిరెడ్డి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 1999, 2004లో గెలుపొందారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం పుంగనూరుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా గెలుపొంది తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక శాఖలైన అడవులు, పర్యావరణం, సాంకేతిక శాఖలకు మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే అప్పుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో ఉంటూ కీలక పాత్ర పోషించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పుంగనూరు నుంచి శాసనసభ్యునిగా గెలిచి వైఎస్ జగన్ క్యాబినెట్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నేడు రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక నేతగా చక్రం తిప్పుతూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.