పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలు 2024
పవన్ కల్యాణ్ తెలుగు సినీ నటుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు. చిరంజీవి, నాగబాబు సోదరుడైన పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులు పవర్ స్టార్‌గా పిలుచుకుంటారు. పవన్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1998లో ఆయన నటించిన తొలి ప్రేమ చిత్రం నటుడిగా పవన్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ తదితర చిత్రాలు పవన్‌కు ఫ్యాన్ ఫ్లోయింగ్‌ను పెంచాయి. పవన్ కొన్ని సినిమాలను నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలిగిన పవన్ కల్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారు.
2008లో తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ యువజన విభాగానికి సారథ్యంవహించారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం తర్వాత పవన్ ఆ పార్టీని వీడారు. 2014 మార్చిలో జనసేన పార్టీని నెలకొల్పారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. బీజేపీ, టీడీపీలకు మద్ధతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 140 స్థానాల్లో పోటీ చేయగా.. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.