నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాలు 2024
నారా చంద్రబాబు నాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. తొలిసారి 1970లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత స్వర్గీయ ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడి ఆయన రెండవ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటికే కాంగ్రెస్ లో కొనసాగుతున్న చంద్రబాబు అదే చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కప్పం నుంచి బరిలో నిలిచిన చంద్రబాబు విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. మరో ఐదేళ్ల తరువాత 1994లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో కుప్పం నుంచి గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆర్థిక, రెవెన్యూ కీలక శాఖలకు మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని తన చేతిలోకి తీసుకుని ముందుండి నడిపించారు. 1999లో మరోసారి కుప్పం నుంచి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2003లో చంద్రబాబుపై బాంబుదాడి జరిగి పెనుప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత జరిగిన 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉండిపోయారు చంద్రబాబు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతుకను గట్టిగా వినిపించారు. వైఎస్ఆర్ మరణానంతరం 2014 విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడి అధికారం కోల్పోయారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటేందుకు సన్నద్దమవుతున్నారు.