నందమూరి బాలకృష్ణ ఎన్నికల ఫలితాలు 2024
నందమూరి బాలకృష్ణ.. నటవిఖ్యాత నందమూరి తారకరామారావు కుమారుడిగా బాల్యంలోనే సినీరంగంలో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దివంగత మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణతో పాటు బాల కృష్ణ కూడా తిరిగారు. సినిమా హీరోగా, తండ్రితో రాజకీయాల్లో తిరుగుతూ ప్రజల్లో స్థానం సంపాధించుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఉత్తరోత్తర నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో బాలకృష్ణ రాజకీయంగా ముఖ్య పాత్ర పోషించారు. చాలా సార్లు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ టీడీపీని విజయశిఖరాలకు తీసుకెళ్లారు. ఈక్రమంలోనే 2014లో టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి బి. నవీన్ నిశ్చల్‌పై విజయం సాధించారు. అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండో సారి శాసనసభ్యునిగా పోటీలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్‌పై ఘనవిజయం సాధించారు. రానున్న 2024 లో కూడా టీడీపీ నుంచి హిందూపురం నియోజకవర్గాన్నే కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఈ సారి విజయం సాధిస్తే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన హ్యాట్రిక్ రికార్డు సాధించే అవకాశం ఉంది.