నాదెండ్ల మనోహర్ ఎన్నికల ఫలితాలు 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. 1964 ఏప్రిల్ 6న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు మనోహర్. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు దంపతుల కుమారుడే మనోహర్. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడైన మనోహర్.. దేశ విదేశాల్లో జరిగిన అనేక టోర్నీల్లో పాల్గొన్నారు. 1986 జాతీయ క్రీడల్లో మనోహర్ కాంస్య పతకాన్ని సాధించారు. నాదెండ్ల మనోహర్ భార్య పేరు డాక్టర్ మనోహరం. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనోహర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మరోసారి తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు. 2011 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్‌గా గుర్తింపు పొందిన మనోహర్.. మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరారు. అనతి కాలంలో జనసేనలో కీలక నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. జనసేన పీఏసీ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోహర్.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన తెనాలి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.