కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ఫలితాలు 2024
నెల్లూరోళ్ల రాజకీయం ఎప్పుడూ వెరైటీయే. నేనైతే అంతకుమించి.. వెరైటీకే వెరైటీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తన పంథా మార్చుకోకపోవడం శ్రీధర్ రెడ్డి స్టయిల్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో పాల్గొన్నారు. మొదట ఏబీవీపీలో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్‌లో కీలక స్థానానికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచిన తొలితరం నాయకుల్లో ఆయన ఒకరు. పీసీసీ కార్యదర్శిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున కోటంరెడ్డి గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున గెలిచిన ఆయన విపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా తనదైన దూకుడు శైలితోనే ఉన్నారు. వైఎస్ జగన్ కేబినెట్‌లో తనకు బెర్త్ దక్కుతుందని అశించిన శ్రీధర్ రెడ్డి భంగపడ్డారు. ఇక అప్పటి నుంచి బహిరంగంగానే ఆయన తన అసహనాన్ని ప్రదర్శించారు. చివరకు ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన కార్యకర్తలతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అధికారి పార్టీ నేతలపై ఆరోపణ చేశారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేసిన కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధమయ్యారు.