కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఎన్నికల ఫలితాలు 2024
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నేత. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కుమారుడిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో పుట్టి, పెరిగినప్పటికీ ఉన్నత విద్యపై దృష్టిపెట్టారు. 2001లో బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. తన తండ్రి 2006లో చనిపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఈయన ప్రస్థానం ప్రారంభమైంది. వైఎస్ఆర్ మరణానతంరం కొంత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2013 ఆగస్టు 23న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో వచ్చిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపించారు. ఆ తరువాత 2019లో మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిరోజూ ప్రజల మధ్య ఉంటూ తన నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, వార్డుల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. 2024లో కూడా ఈయనకు ధర్మవరం నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే టికెట్ కేటాయించేందుకు సుముఖంగా ఉంది వైఎస్ఆర్సీపీ అధిష్ఠానం.