కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ఫలితాలు 2024
కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థి దశలో వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం భారత జాతీయ విధ్యార్ధి విభాగం NSUI గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కన్నా. తదనంతర కాలంలో పెదకూరపాడులో నాలుగు సార్లు, గుంటూరు పశ్ఛిమలో ఒకసారి వరుసగా గెలిచి ఏ.పి రాజకీయాలలో తిరుగు లేని కాపు నేతగా ఎదిగారు. వై.ఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరుల ప్రభుత్వాలలో వివిధ హోదాలలో కేబినెట్ మంత్రిగా కూడా తన సేవలందించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. అనంతరం మారిన పరిణామాలతో బీజేపీ వీడి తెలుగు దేశం పార్టీ గూటికి చేరారు.1989 నుంచి 2009 వరకు వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖా మంత్రిగా పని చేశారు. అంతకుముందు కే.రోశయ్య ప్రభుత్వంలోనూ భారీ పరిశ్రమలు, ఆహారశుద్ధి, వాణిజ్యం, ఎగుమతుల ప్రోత్సాహాక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక ఈసారి తెలుగు దేశం పార్టీ తరుఫున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.