గంటా శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాలు 2024
గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయన.. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా.. 1999లో తొలి ప్రయత్నంలోనే టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2012 నుంచి 2014 వరకు రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు కేబినెట్‌లో 2014 నుంచి 2019 వరకు మంత్రిగా పనిచేశారు. 2019లో ఉత్తర విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం పాటు గంటా రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోని స్పీకర్.. 2024 జనవరి 23న దీన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలో నిలుస్తున్నారు.