బీజేపీ గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలిః హరీష్ రావు

దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార టఅర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర మంత్రి హరీష్ రావు గ్రామగ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:13 pm, Fri, 23 October 20

దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార టఅర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర మంత్రి హరీష్ రావు గ్రామగ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీష్ రావు ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తుందని విమర్శించారు. బీజేపీ నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని.. మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఎంత మందికి జాబ్‌లు ఇచ్చారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో లక్షా 24వేల మందికి ప్రభుత్వ కొలువులు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఓటేస్తే కాలిపోయే మోటార్లు.. బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మోటార్లు అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి హరీష్.

కేసీఆర్‌ హయాంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారన్న హరీష్.. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి అని గుర్తు చేశారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.లక్షల బీమా ఇస్తున్నామని, పెట్టుబడికి ఎకరానికి రూ.5వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను దరి చేయనివ్వద్దని హరీష్ రావు పిలుపునిచ్చారు.