పదిహేనేళ్ల ప్రీతు గుప్తాకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా!

భారత 64వ గ్రాండ్‌మాస్టర్‌గా ఢిల్లీకి చెందిన ప్రీతు గుప్తా అవతరించాడు. పోర్చుగల్‌లో జరుగుతున్న పోర్చుగీస్‌ లీగ్‌–2019 చెస్‌ టోర్న మెంట్‌ ఐదో రౌండ్‌లో అంతర్జాతీయ మాస్టర్‌ లెవ్‌ యంకెలెవిచ్‌ను ఓడించిన ప్రీతు.. జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను సంపాదించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ప్రవేశించిన గుప్తా 15 ఏళ్లకే జీఎం హోదా పొంది ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు. జీఎం హోదాకు కావాల్సిన మూడు నార్మ్‌ల్లో మొదటిది జిబ్రా ల్టర్‌ మాస్టర్స్‌లో, రెండోది బైయిల్‌ మాస్టర్స్‌లో గతేడాది సాధించిన గుప్తా.. మూడోది, చివరిదైన నార్మ్‌ను ఈ ఏదాది ఫిబ్రవరిలో పోర్టికో ఓపెన్‌లో అందుకున్నాడు. జీఎం హోదా సాధించిన గుప్తాను భారత దిగ్గజ చెస్‌ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *