దగ్గుబాటి ఫ్యామిలీ.. రెంటికి చెడ్డ రేవడి..!

ఒకప్పుడు ఆమె కేంద్రమంత్రి.. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది.. ఆయనేమో వైసీపీలో ఉన్నారు. తనయుడు కూడా వైసీపీలోనే ఉన్నాడు. ఇది దగ్గుబాటి కుటుంబంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డాక్టర్‌ దగ్గుబాటికి రాజకీయ సంకటం వచ్చిపడిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా ఆయన ముక్కుసూటితనమే కొంపముంచుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రానైట్‌ అక్రమ వ్యాపారులకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించిన దగ్గుబాటిని ఎదుర్కొనేందుకు అదే గ్రానైట్‌ మాఫియా రంగంలోకి […]

దగ్గుబాటి ఫ్యామిలీ.. రెంటికి చెడ్డ రేవడి..!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 2:22 PM

ఒకప్పుడు ఆమె కేంద్రమంత్రి.. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది.. ఆయనేమో వైసీపీలో ఉన్నారు. తనయుడు కూడా వైసీపీలోనే ఉన్నాడు. ఇది దగ్గుబాటి కుటుంబంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డాక్టర్‌ దగ్గుబాటికి రాజకీయ సంకటం వచ్చిపడిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా ఆయన ముక్కుసూటితనమే కొంపముంచుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రానైట్‌ అక్రమ వ్యాపారులకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించిన దగ్గుబాటిని ఎదుర్కొనేందుకు అదే గ్రానైట్‌ మాఫియా రంగంలోకి దిగిందన్న వార్తలు పుకార్లు షికార్లవుతున్నాయి. దగ్గుబాటికి సమాంతరంగా పార్టీలో మరో నేతను జగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు మాఫియా కుట్ర చేసిందంటూ దగ్గుబాటి అనుచరుల్లో,వైసీపీ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి. దీంతో పర్చూరు వైసీపీలో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన పార్టీ క్యాడర్‌లో నెలకొంది. అంతేకాదు.. దగ్గుబాటిపై వైసీపీ అధినేతకు పూర్తి విశ్వాసం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఆయన సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉండటమే. అయితే అటు పురందేశ్వరిని కూడా బీజేపీ పూర్తిగా విశ్వసించలేకపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత 35 ఏళ్లుగా పర్చూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత ఉన్న ఎన్టీఆర్‌ పెద్దల్లుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు ఆయనకు రాజకీయ సంక్షోభం ఎదురైంది. నిన్నటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న దగ్గుబాటి.. ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవి చూశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన కొడుకు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌తో కలిసి వైసీపీ పార్టీలో చేరారు. జూనియర్‌ దగ్గుబాటికి ఈసారి పర్చూరు నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసేందుకు ప్రయత్నించి చివరి నిమిషయంలో హితేష్‌ చెంచురామ్‌కు భారత పౌరసత్వం సమస్య రావడంతో మళ్ళీ తానే పర్చూరు నుంచి పోటీ చేయాల్చి వచ్చింది. అయితే అనూహ్యంగా దగ్గుబాటి ఓటమిపాలయ్యారు. అయితే వైసీపీనే అధికారంలోకి రావడంతో పర్చూరు ఇన్‌చార్జిగా ఆయనే అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అధికారుల బదిలీల్లో, అభివృద్ది కార్యక్రమాల్లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

దగ్గుబాటిని వ్యతిరేకించేవారు స్వంతపార్టీలో ఉన్నా.. అవినీతి విషయంలో ఆయన చండశాసనుడన్న పేరుంది. ఇదే ఇప్పుడు ఆయన కొంపముంచేలా చేసిందట.. గతంలో టీడీపీలో ఉంటూ గ్రానైట్‌, ఇసుక మాఫియాను పెంచిపోషించిన నేతలే ఇప్పుడు వైసీపీలో చేరి ఆయనకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్దం చేశారట.. సీఎం జగన్‌కు దగ్గుబాటిపై ఉన్నవీ, లేనివీ నూరిపోసి తమ పబ్బం గడుపుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. దగ్గుబాటి వ్యవహారశైలి పార్టీకి నష్టం చేకూరుస్తుందంటూ అధిష్టానం వద్ద చెప్తూ.. నియోజకవర్గంలో ఆయన దూకుడుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు వైసీపీ ఇన్‌చార్జిగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడి టీడీపీ గూటికి చేరిన రావి రామనాధం బాబును తిరిగి వైసీపీ చేర్చే విషయంలో దగ్గుబాటి వ్యతిరేక వర్గం సక్సెస్‌ అయ్యింది. ఈ విషయంలో దగ్గుబాటిని సంప్రదించలేదన్న ప్రచారం ఉంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారని తెలుస్తోంది. సీఎం జగన్ వద్దే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని పర్చూరు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. జగన్‌తో దగ్గుబాటి భేటి తరువాత ఎలాంటి పరిణామాలు నెలకొంటాయోనని దగ్గుబాటి అభిమానులు ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే డాక్టర్‌ దగ్గుబాటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొలేదు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి ఇప్పటికీ అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య ఇటీవల కాలంలో కొద్దిపాటి విబేధాలు వచ్చాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్టూరు ఎస్‌ఐ బదిలీ విషయంలో చెరొకరిని సిఫార్సు చేయడం.. దగ్గుబాటి మనస్థాపానికి గురవడం.. చివరకు దగ్గుబాటి సిఫార్సుకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి బాలినేని అధికారులను ఆదేశించడం.. వంటి పరిణామాలు వీరిద్దరి మధ్య కొంతగ్యాప్‌ను పెంచాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దగ్గుబాటి నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రానైట్, ఇసుక మాఫియా ముఠాలు రంగంలోకి దిగిన మంత్రి బాలినేనికి దగ్గుబాటి గురించి చాడీలు చెబుతున్నట్టు తెలుస్తోంది.

అయితే రాజకీయాల్లో తలపండిన దగ్గుబాటి.. తన ప్రత్యర్ధుల ఎత్తులు చిత్తులు చేసే వ్యూహం రచిస్తారని, నేరుగా జగన్‌తోనే భేటీ అయి పర్చూరులో జరుగుతున్న అవినీతి బాగోతాలు, కుట్రలను బట్టబయలు చేస్తారని ఆయన అభిమానులు ధీమాతో ఉన్నారట. మరి జగన్‌‌తో జరిగే భేటీలో ఏం జరుగుతుందో త్వరలోనే తేలనుంది. ఒకవేళ జగన్‌తో భేటీ విఫలమైతే.. దగ్గుబాటి కూడా కమలం గూటికి చేరుతారా.. లేక రాజకీయాలకు కొద్ది రోజులు రెస్ట్ ఇస్తార అన్నది తేలాల్సి ఉంది.