ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో వేర్వేరు కారణాలతో సోమవారం ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన పాయం ప్రసాద్ (28) కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. అతడి ప్రవర్తనపై విసుగెత్తిన తల్లి రమాదేవి సోమవారం మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అదే మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన పాలకుర్తి అరవింద్ (24) ఐటీఐ పూర్తి చేసి కొంతకాలం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోడంతో కొన్నినెలలుగా కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడం అప్పులు అధికమవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకే మండలంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.