ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు వివాహం కుదిరింది. పెళ్లి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ముహూర్త సమయం దగ్గరపడుతుండటంతో రావల్సిన నగదు అందలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది ఆ కుటుంబం. పెళ్లికి డబ్బులు సమకూరలేదని తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. ని గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన తల్లి గోవిందమ్మ(48), కుమార్తెలు రాధిక(30), రమ్య(28) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల గోవిందమ్మ పెద్ద కుమార్తె రాధికకు పెళ్లి సంబంధం కుదిరింది. జనవరి 11న పెద్దలు రాధిక పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అయితే, పెళ్లి ఖర్చుకు డబ్బు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో ఆ కుటుంబం తీవ్ర కలత చెందింది. దీంతో తల్లి, కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. బంగారం మెరుగుపరిచేందుకు వినియోగించే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.