నోయిడాలో దారుణం.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ బంధువులను చంపేసిన గుర్తు తెలియని దుండగులు

|

Feb 06, 2021 | 9:32 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బంధువులు దారుణ హత్యకు గురయ్యారు. నోయిడాలో దారుణం వెలుగుచూసింది.

నోయిడాలో దారుణం.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ బంధువులను చంపేసిన గుర్తు తెలియని దుండగులు
Follow us on

Couple murder in greater noida : దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం నోయిడాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బంధువులు దారుణ హత్యకు గురయ్యారు. కమల్‌నాథ్‌కు త‌మ్ముడు వరుస అయిన నరేంద్రనాథ్ (70), ఆయన భార్య సుమన్ (65) తమ నివాసంలోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

గ్రేటర్‌ నొయిడాలో నరేంద్రనాథ్, భార్య సుమన్‌ కుటుంబసభ్యులతో నివసిస్తుంటారు. న‌రేంద్రనాథ్ ఢిల్లీలో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తుండగా, ఆయ‌న భార్య ఓ స్వచ్చంధ సంస్థలో యోగా టీచర్‌గా ప‌నిచేస్తున్నారు. స్వంత వ్యాపారంతోపాటు నరేంద్రనాథ్ వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. శుక్రవారం తెల్లవారుజామున సిబ్బంది వచ్చిచూసేసరికి నరేంద్రనాథ్‌ ఇంటి సెల్లార్‌లోని బట్టల కుప్పలో విగతజీవిగా పడి ఉండగా, ఆయ‌న భార్య సుమన్ మొదటి అంతస్తులోని హాల్‌లో రక్తపు మడుగులో పడి ఉంది. నరేంద్రనాథ్‌ను నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి దారుణంగా హ‌త్య చేయగా.. ఆయ‌న భార్య సుమన్‌పై కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. అయితే నరేంద్రనాథ్‌కు తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అతను త‌న‌ ఇంటి సెల్లార్‌లో చిరు వ్యాపారులు, కూలీలతో క‌లిసి తరచూ పార్టీ చేసుకుంటుంటారు. హత్య జరిగిన రాత్రి కూడా పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గ్లాసులు, మద్యం సీసాలు, నూడుల్స్, సిగరెట్లను గుర్తించిన పోలీసులు ఈ దిశగా విచారణ చేపట్టారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బంధవులు కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీకి వచ్చిన వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also…  లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌‌‌కు నాన్ బెయిలబుల్ వారంట్.. జరీ చేసిన ఢిల్లీ కోర్టు