మద్యం మనుషులతో ఎలాంటి క్రూరమైన పనులు చేయిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అవును.. తాజాగా మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్(19)గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్(24).. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి తాగుడు మీదే ద్యాస ఉండేది. బుధవారం రాత్రి అన్నం వడ్డించిన సమయంలో… సాంబార్ రుచిగా లేదంటూ తల్లి, సోదరితో అతడు గొడవకు దిగాడు. వంట వండటం కూడా రావడం లేదు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో తల్లి, సోదరి కూడా ఘాటుగా బదులివ్వడంతో.. కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్లో అతడు కంప్లైంట్ చేశాడని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇటు అయినవాళ్లని కోల్పోయి.. అతడు ఇకపై జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి మంజునాథకు వచ్చింది.
Also Read: ఆగని ప్రకంపనలు.. #justasking అంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ