చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే.. ఆ చట్టాన్ని అడ్డుగా పెట్టుకుని నేరాలకు పాల్పడితే..! అది కూడా ఓ ముఠాగా ఏర్పడి, డబ్బుల కోసం ఓ ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. పక్కా ప్లాన్ వేసి దానిని అమలు చేసిన ఆ అధికారి ఆంధ్రప్రదేశ్లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చివరకు ఆ ఐటీ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నా, ప్రస్తుతం ఆ ఎస్‌ఐ మాత్రం పరారీలో ఉన్నాడు. అతగాడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు
ప్రస్తుతం సమాజంలో మోసగాళ్లకు కొదవ లేదు. ఎక్కడ ఏ మూలన చూసిన ఏదో రకంగా మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్న వారే ఎక్కువ..! రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్ళు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ, అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాగాళ్లను కట్టడి చేసే పోలీస్ శాఖకు సైతం ఆ మోసగాళ్లు, కేటుగాళ్ల బారిన పడాల్సి వస్తుంది. సూడో పోలీసులుగా అవతారెమెత్తి అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ పోలీస్ శాఖకు తలనొప్పిగా మారిన కేసులు చాలానే చూశాం. కానీ, అదే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి, డబ్బులు కోసం అడ్డదారి తొక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జనవరి 27వ తేదీన ఏజేఏ యాడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ దర్శన్ ఫిర్యాదు చేశాడు. తన కంపెనీ ద్వారా ఐటీ ఉద్యోగులను రిక్రూట్ చేస్తామని, అమెరికా బేస్ట్ కంపెనీ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 26వ తేదీన తన కంపెనీ కార్యాలయంలోకి ఐదుగురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ పోలీసులమని చెప్పి వచ్చారని, లోపలికి రావడంతోనే కంపెనీ ఉద్యోగుల ఫోటోలు, వీడియోలు తీశారు. నేరుగా సర్వర్ రూమ్‌కు వెళ్లి సీసీ కెమరా వైర్లను కట్ చేసి, పవర్ ఆఫ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తరువాత తనను చాంబర్ లోకి తీసుకెళ్లి, మినిస్టరీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్‌లో ఏజేఏ కంపెనీపై ఫిర్యాదు వచ్చిందని, అందుకోసం తాము విచారణ చేయడానికి వచ్చామని చెప్పారని డైరెక్టర్ దర్శన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆ తరువాత వచ్చిన సీబిసీఐడీ టీమ్‌లోని షేక్ మహముద్ అబ్దుల్ ఖదీర్ అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సీఐడీ సైబర్ క్రైమ్స్, ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఐడీ కార్డు ఉన్న వ్యక్తి తన దగ్గరికి వచ్చి, సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించాడు. ముందుగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ, చివరకి రెండు కోట్ల రూపాయలకు ఒప్పుకున్నారు. తన సిబ్బంది అకౌంట్ల నుంచి తమ కార్యాలయానికి చెందిన నగదు రూ. 72 లక్షలను తనతో పాటు మరో ఇద్దరి అకౌంట్‌లలోకి ట్రాన్సఫర్ చేయించుకుని, ఆతరువాత ముగ్గురిని హోటల్‌కు తీసుకొని వెళ్లారని పేర్కొన్నాడు.
అక్కడ రెండు లక్షల రూపాయల నగదు, ఏటీఎం నుండి సుమారు పది లక్షల రూపాయలు ఆన్‌లైన్‌లో ట్రాన్సఫర్ చేయించుకన్నట్లు బాధితులు తెలిపారు. మిగిలిన డబ్బులు తొందరగా ట్రాన్సఫర్ చేయాలని చెప్పి బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. ఆ తరువాత అందరిని ఓ రూమ్‌లో బంధించి పారిపోయారని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. పక్కా ఆధారాలతో ఫేక్ సీబిసీఐడీ ముఠాకు చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జనవరి 28వ తేదీన నిందితులలో కొంత మందిని పట్టుకున్నారు. ఈ కేసులో విచారణ చేసిన పోలీసులు ఖంగుతినే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాకు నాయకుడు ఆంధప్రదేశ్ పోలీస్ శాఖ, కర్నూల్ రేంజ్ డీఐజీ దగ్గర పనిచేస్తున్న ఎస్‌ఐ సుజన్ అని గుర్తించారు. సుజన్‌కు ఏజేఏ కంపెనీలో పనిచేస్తున్న రంజిత్‌తో పరిచయం ఉంది. రంజిత్‌కు మహేంద్ర అనే అడ్వకేట్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మహేంద్ర, రంజిత్‌లు ఏజేఏ కంపెనీ డైరెక్టర్ బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. ఇందుకోసం రంజిత్, తన స్నేహితుడైన ఎస్‌ఐ సుజన్‌ను సహాయం కోరాడు. దీంతో సుజన్, ఏజేఏ కంపెనీ డైరెక్టర్‌ను ఎలా బెదిరించాలి, ఎలా డబ్బులు వసూలు చేయాలని పక్కా ప్లాన్ వేశాడు. అది ఎలా అమలు చేయాలో చెప్పాడు.
దీంతో రంజిత్, సుజన్ సూచనల ప్రకారం ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. విజయ్‌శేఖర్, రాహూల్, సుబ్బక్రిష్ణ, సందీప్‌కుమార్, రఘురాజు, రాజులతో కలిసి ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు సుజన్. ఈ ముఠాను సీబిసీఐడి టీమ్‌గా ఏలా నమ్మించాలో ఎస్‌ఐ సుజన్ వారికి వివరించాడు. అతను సూచనలు, సలహాలతో ఏజేఏ కంపెనీపై సీబిసీఐడిగా రైడ్ చేసి, డైరెక్టర్ తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. పన్నెండు లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ సీఐడి ముఠాలో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ఎస్‌ఐ సుజన్ కోసం గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…