చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం జోగిండ్లలో నాటు తుపాకీతో జరిపిన కాల్పుల్లో బాలుడు మృతి చెందడం తీవ్ర సంచలనంగా మారింది. పొలంలో పందుల బెడద ఉండటంతో కొందరు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదుపు తప్పిన తూటాలు అక్కడే ఆడుకుంటున్న సుభాష్ అనే బాలుడి కడుపులోకి దూసుకెళ్లాయి. వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించగా , చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు రాళ్లబూదుగూరు ఎస్సై మురళీ మోహన్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోలిశెట్టిపల్లె సమీపంలోని జోగిండ్లకు చెందిన కొందరు పోషిస్తున్న పందులు సమీప తోటల్లోకి వెళ్లాయి. దీంతో శివ అనే యువకుడితో పాటు మరి కొందరు నాటు తుపాకీతో వాటిని కాల్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తుటాలు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న సుభాష్ అనే బాలుడి కడుపులోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం పీఈఎస్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందిన తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి సరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారి వద్ద తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..? ఇంకా తుపాకులు ఎవరెవరి దగ్గర ఉన్నాయనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నాటు తుపాకులు అక్కడక్కడ లభిస్తున్నాయి. కొందరు అక్రమంగా నాటు తుపాకులను అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా నాటు తుపాకులు కలిగి ఉండటం చట్టవిరుద్దం. తన కుమారుడిని బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని బాలుని తల్లి కోరుతోంది.