విమానాశ్రయాల్లో గందరగోళం.. మోదీ ప్రభుత్వంపై రాష్ట్రాల ధ్వజం

| Edited By: Pardhasaradhi Peri

May 26, 2020 | 3:41 PM

దేశంలోని అనేక విమానాశ్రయాల్లో సోమవారం గందరగోళ పరిస్థితులు ఏర్పడడానికి మోదీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమని పలు రాష్టాలు విమర్శించాయి.

విమానాశ్రయాల్లో గందరగోళం.. మోదీ ప్రభుత్వంపై రాష్ట్రాల ధ్వజం
Follow us on

దేశంలోని అనేక విమానాశ్రయాల్లో సోమవారం గందరగోళ పరిస్థితులు ఏర్పడడానికి మోదీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమని పలు రాష్టాలు విమర్శించాయి. మే 25 నుంచి విమాన సర్వీసులను పునరుధ్దరిస్తున్నట్టు 21 వ తేదీన ప్రభుత్వం ప్రకటించినప్పుడు తాము ఆశ్చర్యపోయామని ఆయా రాష్ట్ర అధికారులు తెలిపారు. ఢిల్లీ, బెంగుళూరు, ముంబై సహా వివిధ రాష్ట్రాల ప్రధాన ఎయిర్ పోర్టుల్లో నిన్న తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఒక మాట చెబితే.. ప్రభుత్వ ఏజెన్సీలు మరో మాట చెప్పాయని వారు ఆరోపించారు. దీంతో గందరగోళం మరింత పెరిగిందని ఉత్తరాది రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యా నించారు . అసలు నాలుగో దశ లాక్ డౌన్ గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 31 వరకు కూడా విమానాలను అనుమతించబోమని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విమాన సర్వీసులను ప్రారంభించేందుకు రాష్ట్రాలు కూడా రెడీగా ఉన్నాయా.. ఆయా ఎయిర్ పోర్టుల్లో ఇందుకు ప్రోటోకాల్ ఎలా పాటిస్తారు వంటి విషయాలపై  రాష్ట్రాలతో కేంద్రం చర్చించి ఉండాల్సిందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఏపీ వంటి చాలా రాష్ట్రాలు తమ అభ్యంతరాలను ముందే వెల్లడించాయన్నారు. ఇదేకాదు.. మార్చి 25 నుంచి దేశ వ్యాప్త లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని మోదీ కేవలం నాలుగు గంటల ముందు ప్రకటించారని, రాష్ట్రాలకు ఇంతే సమయానికి నోటీసులు ఇఛ్చారని వారన్నారు.