Jhunjhunu village : ఉల్లాసంగా, ఉత్సాహంగా కదలాడే ఆ ఊరు మొత్తం ఇప్పుడు నిర్మానుషమైపోయింది. గ్రామంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. పిల్లలు గిల్లి దండా ఆడటం లేదు. ఊర్లో ఎక్కడా ఉల్లాసం లేదు, పిచ్చాపాటి కబుర్లు లేవు. కేవలం ఎడారిగా ఉన్న వీధులు, మూసిన తలుపులు కనిపిస్తున్నాయి. కిటికీల గుండా అయిష్టంగా చూడటం వంటివి రాజస్థాన్ లోని సియలోకల గ్రామంలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు. విషయం ఏంటంటే అసలు కరోనా దరిదాపుల్లోకి రాని ఆ ఊర్లో ఉన్న ఫళంగా ఒక్కరోజే ఏకంగా 95 మందికి కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఊర్లో ఉన్నవాళ్లంతా రెండు రోజుల వ్యవధితో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా కరోనా విలయతాండవం కనిపించింది. దీనంతటికీ ఆ ఊర్లో జరిగిన మూడు వివాహాలు, ఒక అంత్యక్రియల కార్యక్రమం కారణంగా తెలుస్తోంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం కఠినమైన చర్యలను ప్రవేశపెట్టింది.
అయితే, గ్రామస్తులు సరైన ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఉపద్రవం వచ్చిపడినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజస్థాన్ వైద్య ఆరోగ్యశాఖ రంగంలోకి దిగి బాధితులకు వైద్యసాయం అందిస్తోంది.