లాక్‌డౌన్ వేళ గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ వ్యక్తి మరణించాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే…
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తెనపల్లి చెక్ పోస్ట్ మీదుగా మెడికల్ షాపునకు వెళుతున్న మహమ్మద్ గౌస్ అనే యువకుడిని నిలువరించిన పోలీసులు, ఎందుకు బయటకు వచ్చావంటూ కొట్టారు. పోలీసుల దెబ్బలకు తాళలేక అక్కడే గౌస్, కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌస్ ప్రాణాలు విడిచాడు. అతని మృతికి పోలీసులే కారణమంటూ, బంధువులు ఆందోళనకు దిగారు.
జరిగిన సంఘటనపై పోలీసు స్పందిస్తూ..ఆ ప్రాంతంలో రెడ్ జోన్ అమలులో ఉన్నందున కంటైన్ మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గౌస్ ను పోలీసులు ఆపిన సమయంలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ను చూపించలేదని తెలిపారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, జరిగిన ఘటనపై శాఖా పరమైన విచారణకు ఆదేశించామని, పోలీసుల తప్పుందని భావిస్తే, చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్ ఐ రమేష్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.. కాగా ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, బాద్యులపై చర్యలు తీసుకుంటామాని ఐజి ప్రభాకరరావు ప్రకటించారు.