Covid vaccine : ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో ప్రస్తుతం కంట్రోల్‌లోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి నియంత్రణలోనే ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు దాదాపు 15వేల కేసులు నమోదవుతున్నప్పటికీ, రోజువారీ కొవిడ్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి టీకా అందించారు. రెండో దశలో 65 ఏళ్లు పైబడినవారికి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు 45 ఏళ్లకు మించిన వారికి టీకాలను వేస్తున్నారు. దీంతో విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రపతి, ప్రధానితో సహా ప్రముఖలందరూ టీకా తొలి డోసును తీసుకున్నారు. అయితే, కొవిడ్ టీకా పంపిణీ వేగవంతం చేయడంలో భాగంగా వీటిపై ఉన్న సమయ పరిమితిని ప్రభుత్వం తొలగించింది. ప్రజలు అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నారు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
सरकार ने #vaccination की रफ़्तार बढ़ाने के लिए समय की बाध्यता समाप्त कर दी है। देश के नागरिक अब 24×7अपनी सुविधानुसार टीका लगवा सकते हैं।
PM श्री @narendramodi जी देश के नागरिकों के स्वास्थ्य के साथ-साथ उनके समय की कीमत बखूबी समझते हैं।#VaccineAppropriateBehavior pic.twitter.com/cpKVlXurvL
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2021
టీకా పంపిణీకి ఆసుపత్రులు నిర్ణీత షెడ్యూల్ అంటూ ఉండాల్సిన అవసరం లేదని, వీటిని ఏ సమయంలోనైనా పంపిణీ చేసే వెసులుబాటు ఉందని సూచించారు. ఇక, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేసుకోవచ్చని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కొవిన్ యాప్ పోర్టల్‌లో కేవలం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అని ఉన్నప్పటికీ, అంతకు ముందు లేదా సమయం గడిచిన తర్వాత వ్యాక్సిన్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ సమయాలను నిర్దేశించుకోవచ్చన్నారు. ఇలాంటి సమయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందిస్తే సరిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా టీకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా నిల్వ చేసుకోవద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
ఇదిలావుంటే, గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 98 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 88శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలోనే అత్యధికంగా 54 మంది మృత్యువాతపడ్డారు. కేరళలో 16, పంజాబ్‌లో 10 మరణాలు నమోదయ్యాయి. దేశంలో నిన్న 14,989 కేసులు నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 7863 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 2938, పంజాబ్‌లో 729 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కేరళ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు తగ్గాయి, మహారాష్ట్ర, పంజాబ్, దిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రం ఇవి క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు కోటి 56లక్షల మందికి కొవిడ్ టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.