CORONA EFFECT: దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు కరోనా.. ఎవరెవరికి ఎప్పుడంటే?

|

Apr 14, 2021 | 7:30 PM

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే కాదు... ముఖ్యమంత్రులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు ఎవరు ఏంటనేది చూద్దాం…

CORONA EFFECT: దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు కరోనా.. ఎవరెవరికి ఎప్పుడంటే?
Cm's Have Corona Positive
Follow us on

CORONA EFFECT AMONG CHIEF MINISTERS: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కలవరం రేకెత్తిస్తోంది. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సెకండ్ వేవ్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అందులోను ప్రజలతో సంబంధం ఉన్న నేతలను కరోనా పలకరిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే కాదు… ముఖ్యమంత్రులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు ఎవరు ఏంటనేది చూద్దాం…

2020 జులై 25వ తేదీన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన్ను ఎంపీ రాజధాని భోపాల్‌లో ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదే సంవత్సరం ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా రాగా.. తిరుపతిలోని స్విమ్స్‌లో వుంచి చికిత్స అందించారు. అప్పట్లో స్విమ్స్ కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా వుండింది. 2020 సెప్టెంబర్ 2వ తేదీన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుంచి చికిత్స అందించారు. అదే నెలలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్‌కు కరోనా సోకింది. 2020 నవంబర్ 15వ తేదీన మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌కు కరోనా సోకినా పెద్దగా లక్షణాలు లేకపోవడంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో వుండి చికిత్స తీసుకున్నారు.

2020 డిసెంబర్ 11 వ తేదీన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మాకు కరోనా పాజిటివ్ రాగా హోం ఐసోలేట్ అయ్యారు. డిసెంబర్ 12వ తేదీన ఉత్తరాంఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా సోకడంతో ఐసోలేషన్ లో చికిత్స పొందారు. మొన్న ఏప్రిల్ 7వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా తేలింది. తన నివాసంలోనే ఐసోలేట్ అయి చికిత్స పొందుతున్నారాయన. ఏప్రిల్ 8వ తేదీన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయన అదివరకే కరోనా వ్యాక్సిన్ పొంది వున్నారు. అయితే.. ఫస్ట్ డోస్ అయినా కేవలం 40 శాతం మాత్రమే నిరోధక శక్తి రావడంతోపాటు వృద్ధాప్యం వల్ల పినరయికి వైరస్ సోకినట్లు భావిస్తున్నారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులిద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 11 తేదీనుంచి హోం ఐసోలేషన్‌లో వున్నారు. ఆయన కార్యాలయంలో పని చేసే సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో సీఎం స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్ళారు. ఏప్రిల్ 14న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఇక యుపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ఏప్రిల్ 12వ తేదీన కరోనా సోకడంతో ఆయన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు.

ALSO READ: వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్.. ఆ దేశాల విజయ రహస్యమిదే!