#Corona effect లాక్ డౌన్‌తో ఇబ్బందులు.. సీఎం జగన్ తాజా డెసిషన్

లాక్ డౌన్‌తో పెరిగిపోతున్న సమస్యలను తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిత్యావసర వస్తువుల కోసం పెద్ద ఎత్తున బయటికి వస్తూ మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నప్రజలకు ఊరటనిచ్చేందుకు ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

#Corona effect లాక్ డౌన్‌తో ఇబ్బందులు.. సీఎం జగన్ తాజా డెసిషన్
Follow us

|

Updated on: Mar 25, 2020 | 5:17 PM

Jagan latest decision to ease lock down problems:  ఒకటి రెండ్రోజులు ఇళ్ళకే పరిమితమవడం అంటే ఓకే.. కానీ ఏకంగా 21 రోజులు నిరవధికంగా ఎవరికి వారు స్వీయ గృహ నిర్బంధం అంటే ఎవరికైనా కష్టసాధ్యమే. కానీ కరోనా ప్రమాదం తీవ్ర రూపంలో ముంచుకొచ్చిన నేపథ్యంలో ఇది కంపల్సరీ అయ్యింది. ఇళ్ళకే పరిమితం అవుతాం. కానీ నిత్యావసరాల పరిస్థితి ఏంటి? రోజూ వారీ కూరగాయల పరిస్థితి ఏంటి ? ఇదిప్పుడు మధ్యతరగతితోపాటు తక్కువ ఆదాయ వర్గాల ఇళ్ళలో పెద్ద సమస్య అయి కూర్చుంది. దీన్ని నివారించేందుకు ఏపీలోని జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కొంత ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, దానికి సంబంధించిన పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి పెద్ద ఎత్తున ఇళ్ళలోంచి బయటికి రావడం మరింత ఇబ్బందులను తెచ్చే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. దాంతో రైతు బజార్లను వికేంద్రీకరించడం ద్వారా రద్దీని చాలా మటుకు నివారించవచ్చని ముఖ్యమంత్రి భావించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు వీలైనంత త్వరగా తీసుకోవాలన్నారు. అంతవరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షాప్‌లను అనుమతించాలని నిర్ణయించారు.

కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు నిర్దేశించారు. 144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంచాలన్నారు సీఎం. సప్లై చైన్‌ దెబ్బతినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని ఆదేశించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే… 1902 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కాల్‌సెంటర్‌లో ఒక సీనియర్‌ అధికారిని పెట్టి.. ఫిర్యాదు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.