క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 సూత్రాలు పాటించండి

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. కొందరు డాక్టర్ కావాలని, మరికొందరు ఇంజనీర్ కావాలని, ఇంకొందరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలలు కంటారు. అయితే కేవలం తెలివితేటలు, ప్రతిభ ఉంటే సరిపోదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా ఎంతో అవసరం. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం..

క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 సూత్రాలు పాటించండి
Master Your Mind With These 4 Golden Rules

Updated on: Nov 23, 2026 | 11:20 AM

ఒక చిన్న పట్టణంలో ర్యాన్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఏ పనినైనా సులభంగా చేయగల ప్రతిభ అతనికి ఉండేది. భవిష్యత్తులో గొప్ప డాక్టర్ కావాలన్నది అతని కల. అయితే అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. తన మనసును అదుపులో ఉంచుకోలేకపోయేవాడు. చదువుకోవడానికి కూర్చున్న ప్రతిసారీ అతని మనసు పక్కదారి పట్టేది. కొన్నిసార్లు ఫోన్ చూస్తూ, మరికొన్నిసార్లు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో సమయం గడుపుతూ ఉండేవాడు. ఇంకొన్నిసార్లు పగటి కలల్లో మునిగిపోయేవాడు. ‘ఇంకా చాలా సమయం ఉంది.. తర్వాత చదువుకుందాం’ అని తనకు తాను చెప్పుకునేవాడు. కానీ ఆ తర్వాత అనే సమయం ఎప్పుడూ వచ్చేది కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత చెప్పినా అతనిలో మార్పు రాలేదు. తెలివితేటలు ఉంటే చాలని, విజయానికి అవే సరిపోతాయని ర్యాన్ భావించేవాడు. ఒకరోజు పాఠశాలలో నిర్వహించిన స్కాలర్‌షిప్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ స్కాలర్‌షిప్ వస్తే తన డాక్టర్ కలను నెరవేర్చుకోవడం సులభమవుతుందని ర్యాన్ ఆశించాడు. కానీ ఫలితాలు చూసిన అతనికి నిరాశ ఎదురైంది. పరీక్షలో అతను విఫలమయ్యాడు. క్రమం తప్పకుండా చదివిన అతని స్నేహితులు మంచి మార్కులు సాధించారు. ఒకప్పుడు తనను ప్రశంసించిన ఉపాధ్యాయులే ఇప్పుడు నిరాశగా చూశారు.

ఆ రోజు సాయంత్రం ర్యాన్ ఒంటరిగా కూర్చొని తన తప్పుల గురించి ఆలోచించాడు. తనకు తెలివితేటలు లేకపోవడం వల్ల కాదని, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్లే ఓడిపోయానని తెలుసుకున్నాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే విజయం సాధించలేమని, క్రమశిక్షణ కూడా అవసరమని అర్థం చేసుకున్నాడు. తనలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్న ర్యాన్.. విద్యార్థులకు క్రమశిక్షణ, ఏకాగ్రత నేర్పించే కోచ్ మిల్లర్‌ను కలిశాడు. తన సమస్యను వివరిస్తూ, చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం చేయాలని అడిగాడు. కోచ్ మిల్లర్ చిరునవ్వుతో ర్యాన్‌ను పాఠశాల మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేసి, బొమ్మ విల్లు, బాణం ఇచ్చాడు. బోర్డు మధ్యలో గురి పెట్టాలని సూచించాడు. ర్యాన్ బాణం వేశాడు. కానీ అది లక్ష్యాన్ని చేరుకోలేదు. కోచ్ మిల్లర్.. బాణం వేసేటప్పుడు దేనిని గమనించావని అడిగాడు. చుట్టూ ఉన్న చెట్లు, మైదానం, బోర్డు అన్నింటినీ చూశానని ర్యాన్ చెప్పాడు. అప్పుడు కోచ్ మిల్లర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మంచి విలుకాడు తన లక్ష్యాన్ని మాత్రమే చూస్తాడు. చుట్టూ ఉన్న ఇతర విషయాలపై దృష్టి పెట్టడు. అలాగే జీవితంలో కూడా మన లక్ష్యంపై మాత్రమే ఏకాగ్రత పెట్టాలి. ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి పరధ్యానాలకు దూరంగా ఉండాలి’ అని వివరించాడు. అంతటితో ఆగకుండా కోచ్ మిల్లర్ ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుకోవడానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను ర్యాన్‌కు వివరించాడు.

  • ఆలోచనలను నియంత్రించుకోవాలి: చదువుకునేటప్పుడు మనసు ఇతర విషయాల వైపు వెళ్లడం సహజం. అలాంటప్పుడు వెంటనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఇది చదువుకునే సమయం, ఇప్పుడు నా లక్ష్యంపై దృష్టి పెట్టాలి అని గుర్తుచేసుకోవాలి.
  • రోజువారీ దినచర్యను రూపొందించుకోవాలి: ప్రతిరోజూ ఏ సమయంలో చదవాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక క్రమబద్ధమైన టైమ్‌టేబుల్‌ను తయారు చేసుకొని దానిని కచ్చితంగా పాటించాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా క్రమశిక్షణ అలవాటవుతుంది.
  • పరధ్యానాలకు దూరంగా ఉండాలి: చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్, టీవీ, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలి. అవసరం లేని యాప్‌లను పక్కన పెట్టాలి. మన సమయాన్ని వృథా చేసే అలవాట్లను తగ్గించుకోవాలి.
  • ప్రతిరోజూ సాధన చేయాలి: ఒక్కరోజులోనే ఏకాగ్రత పెరగదు. ప్రతిరోజూ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ మంచి అలవాట్లను అలవరచుకోవాలి. నిరంతర సాధనతోనే మనసుపై నియంత్రణ సాధ్యమవుతుంది.

కోచ్ మిల్లర్ చెప్పిన నాలుగు సూత్రాలను ర్యాన్ శ్రద్ధగా పాటించడం ప్రారంభించాడు. చదువుకునే సమయంలో ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసేవాడు. క్రమం తప్పకుండా టైమ్‌టేబుల్ ప్రకారం చదివేవాడు. మనసు పక్కదారి పట్టిన ప్రతిసారీ తన లక్ష్యాన్ని గుర్తుచేసుకునేవాడు. మొదట్లో కష్టంగా అనిపించినా, రోజులు గడిచేకొద్దీ అతనిలో మార్పు వచ్చింది. గంటల తరబడి ఏకాగ్రతతో చదవగలిగే స్థాయికి చేరుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మరో ముఖ్యమైన పరీక్ష రాశాడు. ఈసారి కేవలం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, మొదటి స్థానంలో నిలిచాడు. తన విజయం అదృష్టం వల్లనో, తెలివితేటల వల్లనో మాత్రమే రాలేదని, క్రమశిక్షణతో చేసిన కృషి వల్లే సాధ్యమైందని ర్యాన్ గ్రహించాడు. సుమారు ఏడాది తర్వాత స్కాలర్‌షిప్ అందుకోవడానికి వేదికపైకి వెళ్లినప్పుడు కోచ్ మిల్లర్ చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. మనసు ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని నియంత్రించకపోతే ఎటువైపైనా తీసుకెళ్తుంది. కానీ దానికి సరైన శిక్షణ ఇస్తే మన గమ్యస్థానానికి చేరుస్తుంది.

ఇవి కూడా చదవండి

తెలివితేటలు మనకు అవకాశాలను చూపిస్తాయి. కానీ క్రమశిక్షణ, ఏకాగ్రత, నిరంతర సాధన మాత్రమే మనల్ని విజయానికి చేరుస్తాయి. కాబట్టి మీ మనసుకు క్రమశిక్షణతో శిక్షణ ఇవ్వండి. విజయం మీ వెంట వస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us