US VISA: యూఎస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. వీసా స్లాట్లు పెంచే ఆలోచనల్లో అమెరికా..

|

Apr 15, 2022 | 2:03 PM

యూఎస్‌లో చదువుకునేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి.

US VISA: యూఎస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. వీసా స్లాట్లు పెంచే ఆలోచనల్లో అమెరికా..
Us Student Visa Application
Follow us on

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌. యూఎస్‌లో చదువుకునేందుకు(US student visa) ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబై, కోల్‌కతలోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల వీసాలకు డిమాండు అధికంగా ఉండటంతో కొన్ని ఆంక్షలను కూడా విధించే అవకాశం ఉంది. ఒక సీజనులో ఒకదఫా మాత్రమే విద్యార్థి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అవకాశం కల్పించనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. సాధారణంగా ఒకసారి వీసా తిరస్కరణకు గురైన తరవాత కొద్ది రోజుల వ్యవధిలో అదే కాన్సులేట్‌ లేదా ఇతర కార్యాలయాల్లో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవటం ఇప్పటి వరకు జరిగింది.

ఈ విధానంతో ఇంటర్వ్యూ స్లాట్లు లభించక ఇతర విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు వీసా స్లాట్లను కనీసం 30 శాతం అదనంగా కేటాయించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో వీసా స్లాట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా ఆ సంఖ్యను వెయ్యికిపైగా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పర్యాటక వీసాలైన బి1, బి2 వీసాలు జారీ చేయటంలేదు.

గతంలో వీసా తీసుకుని గడువు తీరి రెన్యువల్‌ చేసుకోవాలనుకునే వారికి ఇంటర్వ్యూతో పని లేకుండా డ్రాప్‌ బాక్స్‌ సౌకర్యాన్ని కల్పించింది. ఆ స్లాట్లను కూడా విద్యార్థులకు కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అమెరికాకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో వీసా ఇంటర్వ్యూ కోసం వేచి ఉండే సమయం హైదరాబాద్‌లోనే అత్యధికంగా 913 రోజులు ఉన్నట్లు ఆధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారికి ఇక్కడి కాన్సులేట్‌ సేవలందిస్తోంది. స్లాట్లు లభిస్తే ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

ఇవి కూడా చదవండి: CJI NV Ramana: చేతికి ఎముక లేనితనానికి ఆయనే ట్రేడ్‌ మార్క్‌.. సీఎం కేసీఆర్‌పై సీజేఐ ప్రశంసలు

Prenatal Yoga Benefits: ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా యోగా చేస్తే లేబర్ పెయిన్స్‌ నుంచి రిలీఫ్.. ఎలాగో తెలుసుకోండి..